Breaking News

విద్యుత్తు డిమాండ్ ఎంత పెరిగినా తగ్గేదే లే..!

-భవిష్యత్తు డిమాండుకు అనుగుణంగా సరఫరా
-నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు అందించాలి
-దీనిపై విద్యుత్తు సంస్థలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి
-కొత్త జిల్లాల్లో కార్యకలాపాలతో పెరగనున్న డిమాండ్
-ఏటికేడాది పెరిగిపోతున్న కరెంటు డిమాండ్
-2017-18లో 58704 మిలియన్ యూనిట్ల డిమాండ్
-2020-21కి 68905 మిలియన్ యూనిట్లకు పెరిగింది..అంటే గత ఐదేళ్లలో 17. 3 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుదల
-2022-23కి ఇది 70705 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం
-రోజువారీ సగటు డిమాండ్ 2023 మార్చికి 240 మిలియన్ యూనిట్లకు చేరే చాన్స్
-కొత్త టారిఫ్ తో డిస్కంలకు కొంతమేర ఊరటనిచ్చిన ఏపీఈఆర్సీ
-కొత్త టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానంతో వినియోగదారులకు లబ్ధి
-కొత్త విధానంతో స్లాబ్ల వారీగా బిల్లు
-225 యూనిట్లలోపు వినియోగించే వారికి తక్కువ ధరకే కరెంటు
-టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశం
-ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడి
-సీఎం జగన్మోహన్ రెడ్డి జోక్యంతో గడిచిన రెండేళ్లలో విద్యుత్తు సంస్థలకు దాదాపు రూ.34 వేల కోట్ల సాయం అందిందని వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి.. డిస్కంలకు సూచించిన కార్యదర్శి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరిగి, విద్యుత్తు డిమాండ్ కూడా బాగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలు కానున్నాయి. ఈ నెల 4 నుంచే కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమవనున్నాయి. కొత్త జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. దీంతో విద్యుత్తు డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో విద్యుత్తు డిమాండ్ ఎంత పెరిగినా తట్టుకొని, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు విద్యుత్తు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. డిమాండ్ ఎంత పెరిగినా తగ్గేదే లేదని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రతిన బూనాయి. ఆర్థిక ఇక్కట్లు ఎదురైనా, సీఎం జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ సహాయ సహకారాలతో నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తామని స్పష్టం చేస్తున్నాయి.
వాస్తవానికి ఏటికేడాది విద్యుత్తు డిమాండ్ పెరిగిపోతూనే ఉంది. 2017-18లో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 58704 మిలియన్ యూనిట్లు ఉండగా.. 2021-22 నాటికి అది 68905 మిలియన్ యూనిట్లకు చేరింది. అంటే 10200 మిలియన్ యూనిట్ల డిమాండ్ పెరిగిపోయింది.అంటే గత ఐదేళ్లలో 17. 3 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు డిమాండ్ 70705 మిలియన్ యూనిట్లకు చేరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021-22తో పోలిస్తే 2.6 శాతం మేర డిమాండ్ పెరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతున్నందున 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తును అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ఆదేశించింది. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైనందున రాబోయే రోజుల్లో పట్టణీకరణ బాగా పెరగనుందని, తద్వారా విద్యుత్తు డిమాండ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో నిరంతరాయంగా, వినియోగదారుల శ్రేయస్సే లక్ష్యంగా, సమర్థంగా కరెంటు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆదేశించింది.
రోజువారీ సగటు డిమాండ్ 2018 మార్చిలో 179.64 మిలియన్ యూనిట్లు ఉండగా.. ప్రస్తుత మార్చిలో అది 220.44 మిలియన్ యూనిట్లకు చేరింది. ఇక వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది 240 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2021-22 మార్చిలో పీక్ డిమాండ్ 12032 మెగావాట్లు ఉండగా.. 2022-23 నాటికి ఇది 13000 మెగావాట్లకు చేరుతుందని అంచనా. ఏప్రిల్ 1న (శుక్రవారం) విద్యుత్తు డిమాండ్ 234.1 మిలియన్ యూనిట్లకు చేరగా.. పీక్ డిమాండ్ 12021 మెగావాట్లుగా ఉంది.
విద్యుత్తు సంస్థల విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం విద్యుత్తు సంస్థలకు దాదాపు రూ.34000 కోట్ల ఆర్థిక సాయం అందించిందని తెలిపారు.

గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ బిల్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని విద్యుత్తు సరఫరా పరిస్థితిపై వెబినార్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి విద్యుత్తు సంస్థలను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది, అధికారులు వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. టెలిస్కోపిక్ బిల్లింగ్ సిస్టమ్ కు సంబంధించిన కరపత్రాలను విద్యుత్తు బిల్లులతో కలిపి వినియోగదారులకు అందజేయాలని సూచించారు.
ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రవేశపెట్టిన కొత్త టెలిస్కోపిక్ విధానంతో వినియోగదారులు లబ్ధి పొందనున్నారు. ఈ విధానం వల్ల మొత్తం వినియోగానికి ఒకే స్లాబ్లో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. టెలిస్కోపిక్ బిల్లింగ్ సిస్టమ్తో ఎక్కువ స్లాబ్లలో పడిపోయే వినియోగదారులు.. తక్కువ స్లాబ్లలో, తక్కువ రేట్ల ప్రయోజనాన్ని పొందనున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్లు వినియోగిస్తారనుకుంటే.. తొలి 30 యూనిట్లు రూ.1.90/యూనిట్; తర్వాత 45 యూనిట్లు రూ.3/యూనిట్; ఆ తర్వాత 50 యూనిట్లు రూ.4.50/యూనిట్; అనంతరం 100 యూనిట్లు రూ.6/యూనిట్; చివరి 25 యూనిట్లకు రూ.8.75/యూనిట్ చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఏపీఈఆర్సీ కొత్త విద్యుత్తు టారిఫ్ ను ప్రకటించిందని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ చెప్పారు. 1.91 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయడంలో డిస్కంలకు కొంత మేర ఊరట కల్పించేలా కొత్త టారిఫ్ ను ప్రకటించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో 100 యూనిట్లలోపు విద్యుత్తును వాడే వారికి యూనిట్ రూ.3.11 చార్జీ పడుతుందని, ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువని తెలిపారు. కర్ణాటక, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో 100 యూనిట్లలోపు వాడుకునే వినియోగదారులు యూనిట్ రూ.8.26, రూ.8.33, రూ.7.74, రూ.7.20, రూ.6.19, రూ.6.61, రూ.6.10 చొప్పున చెల్లిస్తున్నారని వివరించారు.
రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో 1.44 కోట్ల (95%) మంది 225 యూనిట్లలోపు వినియోగించే కేటగిరీలోనే ఉన్నారు. 225 యూనిట్లలోపు వినియోగించే వారి నుంచి డిస్కంలు సగటు ధర కంటే తక్కువగానే చార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. మూడు డిస్కంలకు మొత్తం సర్వీసు చార్జీ రూ.6.82 నుంచి రూ.6.98కి పెరిగిందని.. అయినా ఈ కేటగిరీ వినియోగదారుల నుంచి అంతకంటే తక్కువగానే వసూలు చేస్తున్నాయని వివరించారు.
ఈ వెబినార్లో ఏపీ ట్రాన్స్ కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మాజనార్దన్ రెడ్డి, కె.సంతోష్ రావు, డైరెక్టర్ ఏవీకే భాస్కర్, డైరెక్టర్ ఫైనాన్స్/ఏ పీ ట్రాన్స్కో, కె ముథుపాండియన్ మరియు డైరెక్టర్ థర్మల్/ ఏ పీ జెన్కో , జీ చంద్ర శేఖర రాజుపాల్గొన్నారు. డిస్కంలకు ఆర్థికంగా కొంత మేర ఊరట కల్పించినందుకు ఇంధన శాఖ కార్యదర్శి ఏపీఈఆర్సీకి ధన్యవాదాలు తెలియజేశారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతరాయాలు ఎప్పుడైనా సాంకేతిక కారణాల వల్లే వస్తాయని, ఒకవేళ అలా వచ్చినా యుద్ధప్రాతిపదికన వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *