– అన్ని రాష్ట్రాల్లోను విద్యుత్ సమస్య ఉంది.
– సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
– తప్పనిసరి పరిస్ధితులలో పరిశ్రమలకి ఆంక్షలు విధించాం..
– వ్యవసాయానికి పగటిపూట 7గంటల నిరంతర విద్యుత్ కు ఆదేశాలు..
– వివరాలను వెల్లండించిన ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ కోతలు తాత్కాలిక సమస్యేనని, పరిస్థితులను అర్దం చేసుకొని వినియోగదారులు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ కోరారు. శనివారం విజయవాడలో ఆర్ అండ్ బీ బిల్డింగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్ లభ్యత, విద్యుత్ వినియోగం, దాని వ్యత్యాసం తదితర అంశాలపై వివరాలను తెలియజేశారు. గత నెల నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందని, సాగుకు వాడే విద్యుత్ వినియోగం ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందని, సాగుకు తగ్గాక పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుందని ఆయన తెలిపారు. వ్యవసాయానికి పగటిపూట ఏడు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. గృహావసరాలకు 24×7 విద్యుత్ సరఫరా చేయడమేనని మొదటి ప్రాధాన్యత అని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా బి. శ్రీధర్ మాట్లాడుతూ..2022 సంవత్సరంలో మార్చి నెల నుంచే ఎండలు పెరిగాయని, విద్యుత్ వినియోగం అన్ని రంగాల్లోను పెరిగిందన్నారు. 2020 మార్చి-ఏప్రిల్ లో కోవిడ్ లాక్ డౌన్ కారణంగా కేవలం గృహ వినియోగం మాత్రమే ఉండేదని, ఆ వినియోగం 160 మిలియన్ యూనిట్లు (ఎంయూ), 2021 మార్చి-ఏప్రిల్ లో 200 నుంచి 210 మిలియన్ యూనిట్లుగా నమోదైయిందన్నారు. 2022 మార్చి-ఏప్రిల్ లో కోవిడ్ పరిస్థితుల నుంచి పూర్తిగా బయటకు వచ్చామని, అన్ని రంగాల్లోను, పరిశ్రమల్లో ఎకానమిక్ యాక్టివిటీ పెరగడం, వేసవిలో గృహావసరాల వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో రోజుకి 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి మొత్తం 500 మిలియన్ యూనిట్లు అవసరం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో సగటున రోజుకి 235 మిలియన్ యూనిట్ల అవసరం ఉందని.. ఏపీ జెన్ కో ద్వారా 80 నుంచి 85 ఎంయూ, ఎన్టీపీసీ ద్వారా 45 ఎంయూ, ఐపీపీఎస్ 10 ఎంయూ, సోలార్ 25 ఎంయూ, విండ్ 10 ఎంయూ, న్యూక్లియర్ అండ్ ఇతరం ద్వారా అన్నీ కలిపి మొత్తం 180 ఎంయూ వరకూ లభ్యం అవతుందన్నారు. ఇవన్నీ పూర్తి సామర్ధ్యంతో పనిచేస్తున్నాయన్నారు. అయినా కూడా రోజుకి 55 ఎంయూ వరకూ కొరత ఉంటుందని తెలిపారు. ఈ కొరత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిస్సా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా కొరత ఉందని… దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రస్తుత సీజన్ లో మార్చి నెలలో 1,551 మిలియన్ యూనిట్లను యూనిట్ కి 8రూపాయల 11పైసల చొప్పున రూ.1058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఏర్పడిందని, దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం పెరిగి లభ్యత తగ్గిదన్నారు. బొగ్గు సరఫరా గురించి ముఖ్యమంత్రి, ప్రధానితో మాట్లాడటం, రైల్వే, కోల్, ఎనర్జీ మంత్రిత్వశాఖలకు లేఖలు రాయడం, ఎంపీలు కూడా వారిని వెళ్లి కలవడంతో బొగ్గు నిల్వలు లేనప్పటికీ మన రాష్ట్రానికి రోజుకి కావాల్సినంత బొగ్గు వస్తుందన్నారు. జాతీయ ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కొత విధించాల్సి వచ్చిందని, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లేక పోతే గ్రిడ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అందుకే పరిశ్రమల వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించామని తెలిపారు. పరిశ్రమలకు కొంత ఇబ్బంది అయినప్పటికీ.. కానీ తప్పని పరిస్థితి అన్నారు. ఇది తాత్కాలికమే.. నెలాఖరుకు అన్ని పరిస్థితులు సర్థుకుంటుందన్నారు. ఏప్రిల్ 15 నుంచి వ్యవసాయ కోతలు ప్రారంభమై ఏప్రిల్ 30 నాటికి పూర్తవుతాయని, తద్వారా వ్యవసాయ అవసరాల వినియోగించే విద్యుత్ ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందని, ఆ తర్వాత పరిశ్రమలకు యధావిధిగా సరఫరా జరుగుతుందన్నారు. ఆస్పత్రులకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని డిస్కమ్ లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో కూడా కొతర ఉందని, గుజరాత్ లో కూడా పవర్ హాలిడే ఇచ్చారని… అన్నిచోట్ల కొరత ఉందని.. దానిని అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 2014-15 సంవత్సరంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 130 మిలియన్ యూనిట్లు ఉండేదని… ఇప్పుడు సగటు విద్యుత్ వినియోగం 190 మిలియన్ యూనిట్ లు చేరిందన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత, పోస్ట్ కోవిడ్ తర్వాత రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం, దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్ వంటి ఈ మూడు ప్రధాన కారణాలతో విద్యుత్ కొరతతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని… ఈ పరిస్థితులు తాత్కాలికమేనని, త్వరలోనే విద్యుత్ అందుబాటులోకి వచ్చి, అంతా చక్కబడుతుందన్నారు. విద్యుత్ కొరత రోజుకి 20 ఎంయూ వరకూ ఉందని, నికరంగా 30 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేస్తున్నామని.. ఆ 20 ఎంయూల కొరతను అధిగమించేందుకు పరిశ్రమలకు కోత విధించాలని నిర్ణయించామన్నారు. నిన్నటి వరకు పరిశ్రమలకు 10 మిలియన్ యూనిట్ల కోత విధించామని, అది క్రమంగా పెంచుతామన్నారు. ఆ మిగిలిన విద్యుత్ అంతా గృహావసరాలకే వినియోగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత కారణంగా ఎదురవుతున్న కరెంట్ కోతల నుంచి ఈ నెలాఖరుకల్లా ఉపశమనం కలుగుతుందని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు.