సహజ వ్యవసాయం అధారంగా చలనచిత్ర నిర్మాణం అభినందనీయం

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
-అమృత భూమి పాటల వీడియో, సాహిత్యం అవిష్కరించిన హరిచందన్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
సహజ వ్యవసాయం ఇతివృత్తంగా ‘అమృత భూమి’ పేరిట తెలుగులో పూర్తిస్థాయి చలనచిత్రం రూపుదిద్దుకోవటం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సహజ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులు, రైతు సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాలు, ఇతర భాగస్వాములందరికీ మంచి సందేశాన్ని అందించి పూర్తి స్ధాయి అవగాహన కల్పించడంలో “అమృత భూమి” చిత్రం విజయవంతమవుతుందన్న నమ్మకం ఉందన్నారు. శనివారం రాజ్ భవన్ దర్భార్ హాల్ వేదికగా అమృత భూమి చలనచిత్రం ఆడియో, వీడియో, పాటల సాహిత్య పుస్తకాలను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దఎత్తున సహజ వ్యవసాయాన్ని చేపట్టటం అభినందనీయమన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేయవలసిన ఆవశ్యకతను పలు సందర్భాల్లో నొక్కి చెప్పారన్నారు.

సహజ వ్యవసాయం అనే భావనను రాష్ట్రమంతటా వ్యాపింపజేసేందుకు ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై విధాన పత్రాన్ని సిద్ధం చేసే పనిలో ఉండటం అభినందనీయమన్నారు. ‘రైతుసాధికారసంస్థ’ ద్వారా గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సహజ వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తుండగా, 6 లక్షల మందికి పైగా రైతులు ఈ విధానాన్ని అవలంభించటం వ్యవసాయంలో మార్పుకు సూచకమన్నారు. రాష్ట్రం ‘రిసోర్స్ ఏజెన్సీ ఫర్ నేచురల్ ఫార్మింగ్’గా అవతరించటం, ఇక్కడి సహజ వ్యవసాయ కార్యక్రమం ప్రపంచంలోని అనేక దేశాల దృష్టిని కూడా ఆకర్షించటం గర్వకారణమన్నారు.

రైతు సాధికార సంస్థ, రైతుల మద్దతు, ప్రభుత్వేతర సంస్థ జెఎటిటియు ట్రస్ట్ ద్వారా సహజ వ్యవసాయంపై తెలుగులో పూర్తిస్థాయి సందేశాత్మక చలనచిత్రం అమృతభూమి నిర్మించబడటం ఆచరణీయమన్నారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత పారి నాయుడు, గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, రైతు సాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమీషనర్ హరిజవహర్ లాల్, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి అధ్యక్షురాలు వంగపండు ఉష, పద్మశ్రీ అవార్డు గ్రహీత, రైతు నేస్తం పౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *