మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్ధనా మందిరాలు, ముస్లిమ్ సోదరులు అధికంగా నివసించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు త్వరితగతిన కల్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమై వారం రోజులైన సందర్భంగా జిల్లా యంత్రాంగం ముస్లిమ్ సోదరులకు కల్పించవల్సిన ప్రత్యేక సదుపాయాలపై కలెక్టర్ వాకబు చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు మందిరం లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా , జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రియాజ్ సుల్తానా, మచిలీపట్నం డి ఎస్పి మసూమ్ బాషా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఆరోగ్య జాగ్రత్తలు, పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు మసీధులు, ప్రార్థనా మందిరాలు, ముస్లీమ్ సోదరులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో తగినంత తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆర్ డబ్ల్యు ఎస్ ,మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ముఖ్యంగా ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రార్ధనా సమయంలో ఎటువంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సరఫరా శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. రంజాన్ మాసంలో ఫజర్, జోహార్, అసర్, మగ్రిబ్, ఇషా పేరుతో రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడంతో పాటు అల్లాను ప్రసన్నం చేసుకునేందుకు ఖురాన్ పఠిస్తారని అలాగే, ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి మసీదులకు పలువురు హాజరవుతరాన్నారు. కృష్ణాజిల్లాలో మచిలీపట్నం ,పెడన , గుడివాడ, గూడూరు, చల్లపల్లి , తదితర ప్రాంతాలలో ముస్లిమ్ కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్నారన్నారు. మున్సిపల్ కమీషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు, సంబంధిత మసీదులు ఉన్న పరిసరాలలో ఉదయం, రాత్రి బ్లీచింగ్ చల్లడం వంటి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అలాగే మసీదు ప్రాంతంలో శహర్ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించాలని సూచించారు. వీధి విక్రేతలు, తినుబండారాలు విక్రయించే దుకాణాలు రాత్రి 11 గంటల వరకు అనుమతించాలన్నారు. ముస్లిమ్ సోదరులకు రంజాన్ మాసంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. అనంతరం పలువురు ముస్లీమ్ పెద్దలు జిల్లా కలెక్టర్ పుష్ప గుచ్చం అందించి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియచేసారు
ఈ సమావేశంలో , జిల్లా వక్స్ ఇన్స్పెక్టర్ ఖాజామస్తాన్, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), మచిలీపట్నం మునిసిపల్ మాజీ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాంబశివరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఆర్ డబ్ల్యుఎస్ ఏ ఈ సుగుణ, పలువురు ముస్లీమ్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …