అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో 25మందితో నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువు దీరింది. సోమవారం అమరావతి సచివాలయంను ఆనుకుని ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 25 మంది కొత్త మంత్రులతో ఉ.11.31 గం.లకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఉ.11.30గం.లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు వేదికపైకి చేరుకున్నారు. తదుపరి పోలీస్ బ్యాండ్ ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన జరిగింది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వాగతం పలికి అక్షర క్రమంలో మంత్రులుగా నియమించబడిన వారి పేర్లను చదివి వారిని ఒక్కొక్కరినీ వేదికపైకి ఆహ్వానించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డిలకు నమస్కరించి వారి ఆశీస్సులను స్వీకరించారు.
రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో వరుసగా అంబటి రాంబాబు, అంజాద్ భాషా బేపారి,ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్ర నాధ్, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ,దాడి శెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్ నాథ్, గుమ్మనూరు జయరామ్,జోగి రమేశ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరావు,కొట్టు సత్యనారాయణ, కె.నారాయణ స్వామి,కె.వి.ఉషశ్రీ చరణ్, డాక్టర్ మేరుగు నాగార్జున, డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, రాజన్న దొర పీడిక, ఆర్కే రోజా, డాక్టర్ సీదిరి అప్పల రాజు, తానేటి వనిత, విడదల రజని ఉన్నారు. వీరిలో ఆదిమూలపు సురేష్, కెవి.ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఆంగ్లంలో ప్రమాణం చేయగా మిగిలిన వారంతా తెలుగులో ప్రమాణం చేశారు.అంతేగాక అంజాద్ భాషా షేక్ బెపారీ అల్లా సాక్షిగా ప్రమాణం చేయగా మిగతా మంత్రులంతా దైవసాక్షిగా ప్రమాణం చేశారు.పోలీస్ బ్యాండ్ చే జాతీయ గీతాలాపన కార్యక్రమంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిలు నూతన మంత్రులతో గ్రూపు పొటో దిగారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు తదితర అతిధుల గౌరవార్ధం ఏర్పాటు చేసిన హైటీలో వారంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు,రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, పలువురు ప్రభుత్వ సలహాదారులు కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, శాసన సభ డిప్యూటీ స్పీకర్, పలువురు మాజీ మంత్రులు,ఎంపి,ఎంఎల్సి,ఎంఎస్ఏలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి కుటుంబ సభ్యులు, ఇంకా పలువురు ఇతర ప్రజా ప్రనిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …