శ్రీకాకుళం రైలు ప్రమాద బాధితులను ఆదుకోండి…

-పరాయి రాష్ట్రం వారైనా మానవతా దృక్పథాన్ని చూపండి
-మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం
-అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లాకలెక్టర్‌ నివేదించిన తాజా వివరాలను ముఖ్యమంతి కార్యాలయ కార్యదర్శి– సీఎంకు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో 5గురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరణించిన వారిలో గుర్తింపు కార్డులు ఆధారంగా ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందినవారుగా తేల్చారన్నారు. మిగిలిన ముగ్గురిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారు కూడా వేరే రాష్ట్రానికి చెందినవారై ఉంటారని, ఇదే విషయాన్ని అధికారులు తెలిపారని సీఎంకు వివరించారు. ఈఘటనలో గాయపడ్డ ఒక వ్యక్తిని అదే రైలులో శ్రీకాకుళం తీసుకు వచ్చారని, వెంటనే అతన్ని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకున్నారని, గాయపడ్డ వ్యక్తికి అందుతున్న వైద్యాన్ని కలెక్టర్‌ స్వయంగా రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారని, మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపైనా కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారని వివరించారు. మరణించిన వారు పరాయి రాష్ట్రం వారైనా, మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలని, ఈసహాయం వెంటనే అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *