-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుందర హరిత విజయవాడ – పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా రెండోవ రోజైన శుక్రవారం నగరంలోని అన్ని డివిజన్ లలో యాంటి లర్వాల్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ, దోమల లార్వా వృద్ది చెందకుండా ఫ్రైడే – డ్రై డే పై ప్రజలకు అవగాహన కార్యక్రమములు నిర్వహించారు. దీనిలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ రామలింగేశ్వర నగర్ నందు ఏర్పాటు చేసిన వారోత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న దోమల ఉత్పత్తిని నివారించుటకు చర్యలు తీసుకోవటం జరిగిందని, బందరు, ఏలూరు, రైవస్ మరియు బుడమేరు లలో నీటి ప్రవాహం లేకపోవుట, ప్లాస్టిక్ వ్యర్దములు, గుర్రపు డెక్క పెరిగి దోమల లార్వా చేరుతుందని, ఇరిగేషన్ శాఖాధికారులు కూడా నగరపాలక సంస్థ తో సహకరించి కాలువలలో పేరుకుపోయిన వ్యర్ధములు మరియు గుర్రపు డెక్క తొలగించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా నగరపాలక సంస్థ యాంటి లర్వాల్ ఆపరేషన్ పనులకు శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా ప్రతి శుక్రవారం నివాసాలలో డ్రై డే పాటించాలని, ప్రజలు సహకరించాలని కోరారు.
దోమల లార్వా నిర్మూలనకు చర్యలు – ప్రజలు విధిగా ఫ్రీ డే – డ్రై డే పాటించాలి.
బందరు కాలువలో పైలెట్ ప్రాజెక్ట్ గా డ్రోన్ ద్వారా యం.ఎల్.ఆయిల్ పిచికారి
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్,
పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా నేడు నగరంలో చేపట్టిన యాంటి లర్వాల్ ఆపరేషన్ పనులకు సంబందించి బందరు కాలువలో నీటి నిల్వ ఉండు ప్రదేశాలలో దోమల లార్వా నిర్మూలనకై చర్యలు తీసుకోవటం జరిగిందని, నీటి ప్రవాహం సక్రమముగా లేని మేజర్ డ్రెయిన్ మరియు ప్రధాన కాలువ అంచుల వెంబడి మలేరియ సిబ్బంది ద్వారా యం.ఎల్ ఆయిల్ స్ప్రేయింగ్ నిర్వహించుట జరుగుతుందని, సిబ్బంది వెళ్ళుటకు అవకాశం లేని చోట్ల కూడా యం.ఎల్. ఆయిల్ స్ప్రే చేయాలనే సంకల్పంతో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ క్రింద బందరు కాలువలో డ్రోన్ సహకారంతో యం.ఎల్ ఆయిల్ స్ప్రేయింగ్ చేయుట జరుగుతుందని వివరించారు. నివాసాలలో వాడుకపు నీటిలో దోమల లార్వా ఉత్పత్తి చెందకుండా నగర ప్రజలు విధిగా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, మీ ఇంటిలోని వాడుకపు నీటి డ్రమ్ములు, కుండీలు, వాటర్ ట్యాంక్ మొదలగు వాటిని శుభ్రపరచుకోవాలని సూచించారు. అదే విధంగా ఇంటి పరిసరాలలో గల కొబ్బరి బొండాలు, పూల తోట్లు మరియు పనిరాని సామాగ్రి యందలి నీటి నిల్వల యందు దోమలు గుడ్లు పెట్టుటకు అవాసాలుగా తయారు అవుతాయని, అటువంటి ప్రదేశాలు శుభ్ర పరచుకొని ఏవిధమైన నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అన్నారు.
అదే విధంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ నగర అభివృద్ధి పనులతో పాటుగా నగర సుందరికరణకు నగరపాలక సంస్థ అధిక ప్రాధాన్యతను ఇచ్చి ప్రజాభాగస్వామముతో పారిశుధ్య వారోత్సవాలలో ప్రతి రోజు ఒక కార్యక్రమము నిర్వహిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించుట ఎంతో శుభప్రదం అని పేర్కొన్నారు. బందరు కాలువలో దోమల నివారణకు చర్యలు తీసుకోవటం జరిగిందని, మన నగరం శుభ్రంగా ఉంటె మన ఆరోగ్యం కూడా బాగుంటుందని, రాబోవు రోజులలో విజయవాడ నగర ఉత్తమ స్థానం సాదించే దిశ సమిష్టి కృషి చేస్తామని అన్నారు.
పై కార్యక్రమములో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక, పలువురు కార్పొరేటర్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి. గీతాభాయ్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) సత్యవతి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.