-టీడీపీ ఒక ఏడుపు పార్టీగా తయారైంది
-పేదలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై విషం చిమ్మడం సిగ్గుచేటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ రెండు కళ్లుగా నగర ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. పరిశుభ్రత వారోత్సవాలలో భాగంగా 36వ డివిజన్ లో నిర్వహించిన ‘సుందర హరిత విజయవాడ’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తో కలిసి పాల్గొన్నారు. తొలుత నగర సుందరీకరణలో భాగంగా పాడైన గోడలకు రంగులు వేశారు. అనంతరం వారోత్సవాలపై ఇంటింటికీ అవగాహన కల్పిస్తూ.. సీతన్నపేట స్విమ్మింగ్ పూల్ రోడ్డు, నాగమ్మవారివీధి, జామిఅప్పన్నవారివీధి, మీసాలవారివీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రజలకు అందించే త్రాగునీటిని రోజు పరీక్ష చేయాలని అధికారులకు సూచించారు. మంచినీటి కుళాయిల వద్ద నీరు నిల్వ కాకుండా.. చుట్టూ చిన్న చిన్న దిమ్మెలను ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్ లో పల్లంగా ఉన్న అంతర్గత రోడ్లను గుర్తించి.. ఎత్తు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీటికి సంబంధించి అంచనాలను సిద్ధం చేసి.. వీలైనంత త్వరగా టెండర్లను పిలవాలని సూచించారు. అలాగే వెల్ఫేర్ సెక్రటరీలు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. నిజమైన చిరు వ్యాపారులను గుర్తించి జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదలకు పెద్దఎత్తున అందుతున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక.. టీడీపీ ఒక ఏడుపు పార్టీగా తయారైందని మల్లాది విష్ణు విమర్శించారు. పచ్చ మీడియా సాయంతో రోజుకొక సంక్షేమ పథకంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకమైనా.. వైఎస్సార్ సీపీకి సాటి రావనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు గ్రహించాలన్నారు. మరోవైపు సుందర నగరమంటే రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది విజయవాడ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. నగర సుందరీకరణకు వారోత్సవాల పేరిట మరో అడుగు ముందుకు వేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగా మురుగు ప్రాంతాలను పరిశుభ్రపరచడం, యాంటీలార్వా ఆపరేషన్స్ నిర్వహణ, ఫాగింగ్, మొక్కలు పెంచడం వంటి కార్యక్రమాలను రోజుకొకటి చొప్పున నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే సమయం లభించినపుడల్లా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతుండటం హర్షణీయమని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, నాయకులు పుల్పా కృష్ణ, ఇమిడిశెట్టి రాము, ఆర్కే, జొన్నలగడ్డ రామకృష్ణ, ఇప్పిలి శ్రీను, పిల్లా దుర్గారావు, పఠాన్ భూపతి, రాంబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.