మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని, రైతుల పంట రుణాలు, విద్యా రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, జగనన్న చేదోడు, టిడ్కో గృహ లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా రుణాలు అందించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా బ్యాంకర్లకు సూచించారు.
స్థానిక జిల్లా పరిషత సమావేశపు మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకర్లు, జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి వివిధ అంశాలకు సంబంధించి వివరంగా మాట్లాడారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సులభతర విదానాలను అనుసరిస్తూ మెరుగైన సేవలందించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు త్వరితగతిన అందేలా బ్యాంకర్లు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మొబైల్ నంబర్లు ఆధార్ కార్డుతో అనుసంధానం కాబడిన అకౌంట్ నంబర్లు ఎన్ని ఉన్నాయిని బ్యాంకర్లని ఈ సందర్భంగా కలెక్టర్ ను ప్రశ్నించారు. సున్నా వడ్డీ రుణాలు, ఆసరా, చేయూత, అమ్మఒడి తదితర ప్రభుత్వ రుణాలు ఆయా లబ్ధిదారుల ఖాతాలో పడ్డాయో లేదో చాలామందికి తెలియదని మీరు ఎందుకు ఒక చిన్న ఎస్ ఎం ఎస్ ద్వారా వారికి తెలియచేయలేకపోతున్నామని కలెక్టర్ అడిగారు. మనకు జీతం పడినప్పుడు బ్యాంకు నుంచి వచ్చే సందేశం ఎంతో ఆనందం కలిగిస్తుందని, ప్రభుత్వ సొమ్ము జమ కాబడినపుడు లబ్ధిదారులకు అటువంటి అనుభూతి కల్గించాలని బ్యాంకర్లకు సూచించారు. ఈ – క్రాప్ యాప్ అభివృద్ధి చేయడంలో తానూ ముఖ్య భూమిక పోషించిన కారణంగా తనకు జాతీయ అవార్డు లభించినట్లు కలెక్టర్ రంజిత్ బాషా బ్యాంకర్ల హర్షద్వానాల మధ్య తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నేడు కృష్ణాజిల్లాలో 33 కోట్ల 41 లక్షల రూపాయల వైయస్సార్ సున్నా వడ్డీ పథకం రుణాలు విడుదల చేశారన్నారు.
అనంతరం లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్మోహనరావు మాట్లాడుతూ, వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ ద్వారా భారత ప్రభుత్వం ఏప్రిల్ 24 నుండి మే 1 వ తేదీ వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ను పొందని రైతులకు అందించటానికి ‘కిసాస్ భాగిదారి ప్రాధమికత హమారీ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించినదని చెప్పారు. పంట సాగు పశు పోషణ, పాడి పరిశ్రమ మత్స్య కార్యకలాపాల కోసం ఈ ప్రచారంలో ప్రత్యేక డ్రైవ్ చేపడతారని తెలిపారు. పాన్ క్రెడిట్ కార్డ్ పథకం క్రింద రైతులు స్వల్పకాలిక పంట సాగు కోసం రూ.3.00 లక్షల వరకు రుణం పొందవచ్చని, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మత్స్య పరిశ్రమ వంటి అనుబంద కార్యకలాపాల కోసం వర్కింగ్ క్యాపిటల్ రూ .2.00 లక్షల రుణం పొందేందుకు అవకాశం ఉందన్నారు. పంటల సాగు కోసం పాన్ క్రెడిట్ కార్డ్ క్రింద అనుబంద కార్యక్రమాల కోసం గరిష్టంగా రూ.3.00 లక్షలు 7% వడ్డీకి రుణం పొందవచ్చన్నారు. ఆ రుణం సకాలంలో చెల్లించిన వారికి 3 శాతం వడ్డీ ప్రోత్సాహకం అందుబాటులో ఉందన్నారు. ఇంకా రైతులు ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 1.60 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాన్ని పొందవచ్చన్నారు. .
ఈ సమావేశంలో రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఏ జీ ఎం కె. రాజేంద్ర ప్రసాద్, నాబార్డ్ ఏ జీ ఎం విజయ తిరుమెల్ల, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ విశ్వేశ్వరరావు, కృష్ణా డి సి సి బి సి ఈ ఓ శ్యామ్ మనోహర్, బ్యాంకు అఫ్ బరోడా రీజినల్ బ్యాంకు మేనేజర్ రాజశేఖర్, ఎస్ జి బి రీజినల్ మేనేజర్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News