-వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-మాది మహిళా సంక్షేమ ప్రభుత్వం: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమంలో దివంగత మహానేత వైఎస్సార్ చరిత్ర సృష్టిస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ చరిత్రను తిరగరాశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గవర్నర్ పేటలోని ఐ.వి.ప్యాలస్ నందు 1, 23, 24, 25, 26, 27, 28 డివిజన్ లకు సంబంధించి జరిగిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి సహా ఆయా డివిజన్ల వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలు పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. తొలుత సున్నా వడ్డీ పథకంతో అక్కచెల్లెమ్మలకు బాసటగా నిలిచిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలను పెద్దఎత్తున విజయవంతం చేసిన మహిళలందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాలను నిలువునా మోసగించారన్నారు. రుణమాఫీ చేస్తానని హామీనిచ్చి మాట తప్పడంతో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రూ.3 వేల కోట్ల పైచిలుకు అదనపు వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అవ్వా తాతల పెన్షన్ పెంపుపై తొలి సంతకం మొదలుకొని మూడో విడత వైఎస్సార్ సున్నావడ్డీ వరకు ఎక్కడా సంక్షేమంలో మడమ తిప్పని ముఖ్యమంత్రిగా కీర్తి గడించారన్నారు. పేదల జీవన ప్రమాణాలు, స్థితి గతులలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సంక్షేమం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తుంటే.. దానిపై కూడా విమర్శలు గుప్పిస్తూ సోమరిపోతులను చేస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో రాష్ట్రం పేదరికమనే గాఢాంధకారంలోకి నెట్టబడితే.. కేవలం మూడేళ్ల కాలంలో ప్రగతి వైపు నడిపించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 31,100 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 56 కోట్ల 35 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 4,276 మందికి రూ. 17 కోట్ల 26 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 6,232 మందికి రూ. 12 కోట్ల 48 లక్షలు., అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు రూ. 84 కోట్ల 45 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 1,958 మందికి రూ. 3 కోట్ల 22 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 1,947 మందికి రూ. 2 కోట్ల 92 లక్షలు నేరుగా ఆడపడుచుల ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. మొత్తంగా మూడేళ్లలో 74,385 మందికి రూ. 176.70 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు.
సున్నా వడ్డీ పథకం మూడో విడతకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో 4,437 గ్రూపులకు గానూ రూ. 6.55 కోట్ల నగదు ఆడబిడ్డల బ్యాంకు ఖాతాలలో జమ చేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. తొలి విడతలో 4,276 గ్రూపులకు గాను రూ. 5.40 కోట్ల నగదు వారి వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రెండో విడతకు సంబంధించి 4,032 గ్రూపులకు గాను రూ. 5.28 కోట్లు అందజేసినట్లు వివరించారు. మొత్తంగా మూడు విడతలు కలిపి 4,576 గ్రూపులలో రూ. 17.26 కోట్లను సున్నావడ్డీ ద్వారా లబ్ధిచేకూర్చినట్లు వివరించారు. ఒక్కో గ్రూపుకు సగటున రూ. 30 నుంచి 40 వేల వరకు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 1 వ డివిజన్ లో 284 గ్రూపులకు గానూ రూ. 47.70 లక్షలు., 23వ డివిజన్ లో 44 గ్రూపులకు రూ.6.01 లక్షలు., 24 వ డివిజన్ లో 106 గ్రూపులకు గానూ రూ. 15.29 లక్షలు, 25 వ డివిజన్ లో 134 గ్రూపులకు గానూ రూ. 16.85 లక్షలు., 26వ డివిజన్ లో 129 గ్రూపులకు రూ.14.93 లక్షలు., 27 వ డివిజన్ లో 137 గ్రూపులకు గానూ రూ. 17.63 లక్షలు., 28 వ డివిజన్ లో 103 గ్రూపులకు గానూ రూ. 13.24 లక్షలు అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడుగా నిలుస్తోందన్నారు. ఇంకా ఏమైనా పొదుపు సంఘాలకు డబ్బులు జమకానిపక్షాన.. ఆయా గ్రూపుల రీసోర్స్ పర్సన్స్ దృష్టికి తీసుకువస్తే నగదు జమ అయ్యేలా చూస్తామన్నాను.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకంతో మహిళల జీవితాల్లో నూతన వెలుగులు వచ్చాయన్నారు. మహిళ సాధికారతే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన మోసం వల్ల డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. కానీ ఆర్థిక సంక్షోభంలోనూ మహిళ సంక్షేమాన్ని ఎక్కడా జగనన్న ప్రభుత్వం విస్మరించలేదన్నారు. కార్యక్రమంలో నగర అడిషనల్ కమిషనర్(జనరల్) ఎం.శ్యామల, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కుక్కల అనిత, కొండాయిగుంట మల్లీశ్వరి, బంకా శకుంతల దేవి, కొంగితల లక్ష్మీపతి, 26వ డివిజన్ వైఎస్సార్ సీపీ ఇంఛార్జి అంగిరేకుల గొల్లభామ నాగేశ్వరరావు, జోనల్ కమిషనర్ రాజు, డ్వాక్రా సీవోలు, ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.