-మైనార్టీల అభ్యున్నతి వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైనార్టీల అభ్యున్నతి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరం నందు ముస్లిం సోదరసోదరీమణులకు నిర్వహించిన తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరసోదరీమణులు సంతోషంగా, సమానంగా జరుపుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని విమర్శించారు. కానీ మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైనార్టీలకు ఒరిగిందేమీ లేదన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉర్దూను రాష్ట్ర రెండో అధికారిక భాష హోదా కల్పించడంతో పాటు.. రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్ తో ముస్లింలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే.. ఆయన వారసుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి అంతకు మించి సంక్షేమాభివృద్ధిని అందిస్తున్నారన్నారు. ఆయా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 300 మంది ముస్లిం సోదరీమణులకు నిత్యావసరాలు, చీరలను పంచిపెట్టారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధా స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు ఒగ్గువిక్కీ, చల్లా సుధాకర్, యర్రంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.