-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు…
-రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు ఆధ్వర్యంలో గురువారం తూనికలు కొలతలు, పౌరసరఫరాలశాఖ టీమ్ సభ్యులు విజయవాడ, ఊర్మిళ నగర్, కభేళ, మైలవరం, సూరంపల్లి లోని పలు నిత్యావసర సరుకుల దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి సరుకురిజిస్టర్ లను పరిశీలించారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని సాకుగా చూపి వంటనూనెలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సామాన్య కొనుగోలుదారుల వలె దుకాణాలలో వంటనూనెలు కావాలని, వారు చెప్పిన ధర ఎమ్మార్పీ ధరలను సరిచూసుకొని వాటి మధ్య తేడా ఉంటే కేసులు నమోదు చేస్తున్నారు. నిర్దేశిత ఎంఆర్పీ ధరలకే సరుకులను కొనుగోలు చేశారా, అని వినియోగదారులను అడిగి తెలుసుకుంటున్నారు. వంటనూనెలను ఎంఆర్పి ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని దుకాణాల నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు.కందిపప్పు,మినపప్పు, నూనెలను అక్రమంగా నిల్వచెసి బహిరంగ మార్కెట్లో కృతిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయాలు జరిపే దుకాణాల పై కేసులు నమోదు చేయటం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు హెచ్చరించారు.