-సిటిజన్ ఔట్ రీచ్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాల రోడ్డు నందు సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతకై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. నగర సుందరీకరణకు వారోత్సవాల పేరిట వీఎంసీ మరో అడుగు ముందుకు వేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మురుగు ప్రాంతాలను పరిశుభ్రపరచడం, యాంటీలార్వా ఆపరేషన్స్ నిర్వహణ, ఫాగింగ్, మొక్కలు పెంచడం వంటి కార్యక్రమాలను రోజుకొకటి చొప్పున నిర్వహించినట్లు వివరించారు. అలాగే సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమం పేరిట ప్రతినెలా రెండు, మూడు రోజులు అవగాహన ర్యాలీలు నిర్వహించడం జరుగుతోందన్నరు. ఈ కార్యక్రమాలపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే అధికారులతో పాటు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని మల్లాది విష్ణు వివరించారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని భావిస్తేనే సుందర హరిత విజయవాడ కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. ఇందులో భాగంగా వీధుల్లోకి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి, ప్రమాదకర చెత్తలను వేర్వేరుగా అందచేయాలని గృహ యజమాలనుకు సూచించారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఏ లక్ష్య సాధనకు నగరపాలక సంస్థ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందో అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశంలోనే క్లీన్ సిటీ ఏదైనా ఉందంటే.. అది విజయవాడ నగరమని చెప్పుకొనే విధంగా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్(హెల్త్) రామకోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్ పెక్టర్ రామకృష్ణప్రసాద్, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, కమ్మిలి రత్న, శనగవరపు శ్రీనివాస్, నాడార్స్ శ్రీను, ఆచారి, చందు, కొండాయిగుంట రాము తదితరులు పాల్గొన్నారు.