-ఎన్ని సమస్యలు , సంక్షోభాలు ఎదురైనా వెనక్కి తగ్గం
-విద్యుత్ రంగాన్ని సుస్థిరం, బలోపేతం చేస్తాం
-ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యుత్ సంస్థలకు ఆదేశం
-ఏప్రిల్ 28న పీక్ అవర్ లోటు 10.8 గిగావాట్లు
-దేశంలో 2012 తర్వాత ఇదే అత్యధికం
-దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్తు కొరత
-తీవ్ర బొగ్గు కొరతతో ఏపీలో కూడా ఇదే పరిస్థితి
-ఏప్రిల్ 29 నాటికి రాష్ట్రంలో అత్యంత కనిష్ఠ స్థాయికి బొగ్గు నిల్వలు
-అయినా గృహ, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నాం
-విద్యుత్తు కొరత తాత్కాలికమే
-త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి
-దిగుమతి చేసుకున్న బొగ్గు కొనుగోలుకు నేడు జెన్కో టెండర్లు
-ఎస్ఈసీఐ నుంచి యూనిట్ రూ.2.49 చొప్పున సౌర విద్యుత్తు కొనుగోలు
-రైతులకు ఉచిత విద్యుత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్న ఏకైక ప్రభుత్వం మనదే
-అన్ని వర్గాల వారికి నాణ్యమైన కరెంటు సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పెద్దిరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భానుడు రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మండే ఎండలతో ప్రజలుదేశ వ్యాప్తంగా అల్లాడిపోతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు వేసుకోనిదే ఇళ్లలో ఉండలేని పరిస్థితి. ఫలితంగా విద్యుత్తు డిమాండ్ అనూహ్య స్థాయిలో పెరిగిపోతోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర బొగ్గు కొరత. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగానూ బొగ్గు సమస్య తీవ్రమైంది. బొగ్గు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం దిగుమతులపైనా పడింది. దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుదుత్పత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరెంటు కోసం అష్టకష్టాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన 24×7 విద్యుత్ సరఫరా కోసం విద్యుత్తు సంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అనూహ్యంగా విద్యుత్తు కొరత ఏర్పడినా, భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఏర్పడినా తట్టుకునేలా విద్యుత్తు రంగాన్ని మరింత బలోపేతం చేయాలని తేల్చిచెప్పింది. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం…. కరెంటు సరఫరా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా చర్యలు కొనసాగించాలని విద్యుత్తు సంస్థలకు స్పష్టం చేసింది. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో ఒక్క క్షణం కూడా వృథా చేయడానికి వీల్లేదని పేర్కొంది.
అధికారిక లెక్కల ప్రకారం.. ఏప్రిల్ 29న జాతీయ విద్యుత్తు వినియోగం రికార్డు స్థాయిలో 207 గిగా వాట్లకు (1 గిగా వాట్ = 1000 మెగావాట్ల ) చేరింది. అలాగే పీక్ అవర్ లోటు ఏప్రిల్ 28న 10.8 గిగా వాట్స్గా ఉంది. 2012 తర్వాత దేశంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దేశంలోని అనేక రాష్ట్రాలు ఏప్రిల్ 28న గరిష్ఠ విద్యుత్తు కొరతను ఎదుర్కొన్నాయి. కొన్ని రాష్ట్రాలు డిమాండ్ను తట్టుకోవడానికి గ్రిడ్ నుంచి భారీ మొత్తంలో విద్యుత్తును తీసుకున్నాయి.
థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 29 నాటికి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో 1.28 రోజులు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 1.37 రోజులు, కృష్ణపట్నంలో 7.52 రోజులు, హిందుజాలో 1.93 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్లుగా విద్యుదుత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్నికోరింది. మరోవైపు విద్యుత్తు ఎక్స్ఛేంజీలోనూ కరెంటు పరిమితంగానే దొరుకుతోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ గృహ, వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం నాణ్యమైన కరెంటును అందిస్తోంది.
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్తు సంస్థలతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొరత తాత్కాలికమే అని మళ్ళి చెప్తున్నా. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయనే నమ్మకం ఉంది. మనకు బొగ్గు గనులు లేవు. మనం నిరంతరం మహానది బొగ్గు క్షేత్రాలు, సింగరేణిపై ఆధారపడాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సమస్యల కారణంగా థర్మల్ పవర్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు అందుబాటులో లేదు. అదే సమయంలో ఉష్ణోగ్రతల్లో అసాధారణ పెరుగుదల కారణంగా విద్యుత్తు డిమాండ్ అనూహ్య రీతిలో పెరిగిపోతోంది. ఫలితంగా విద్యుత్తు కొనుగోలు వ్యయం గత పదేళ్లలో రికార్డు స్థాయికి చేరుకుంది. బొగ్గు కొరతతో పాటు బహిరంగ మార్కెట్లో పరిమితంగానే కరెంటు దొరుకుతుండడంతో బాధాకరమైనప్పటికీ పారిశ్రామిక రంగానికి కొన్ని ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఈ నెల 15 నుంచి పవన విద్యుదుత్పత్తిని పెంచనున్నాం. దీంతో త్వరలోనే మరింత విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది’’ అని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పరిస్థితిపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రోజువారీ సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పరిస్థితులను మెరుగుపరిచేచందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన 24×7 విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు విద్యుత్తు రంగం బలోపేతానికి డిస్కంలు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, గృహ వినియోగదారులకు కరెంటు కోతలు విధించడం లేదని , వీలునంత మేరకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని , వ్యవసాయ రంగానికి పగటిపూట 7 గంటలు కరెంటును అందిస్తున్నామని తెలిపారు. ఫలితంగా సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవడం లేదన్నారు.
‘‘ భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా భారత సౌర ఇంధన కార్పొరేషన్ (ఎస్ఈసీఐ) (Solar energy corporation of india(SECI)) నుంచి విద్యుత్తు కొనుగోలు చేయాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే’’ అని గర్వంగా చెప్పగలనని పెద్దిరెడ్డి అన్నారు. పవర్ ఎక్స్ఛేంజీలో యూనిట్ రూ.12 నుంచి 16 వరకు, ఉండగా .. సెకి ద్వారా యూనిట్కు కేవలం రూ.2.49/- చొప్పున విద్యుత్తు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా 9 గంటల పాటు పగటి పూట విద్యుత్తు అందుబాటులో ఉంటుందన్నారు.
‘‘రాబోయే 25 ఏళ్లపాటు రైతులకు నమ్మకమైన, నాణ్యమైన కరెంటు సరఫరాకు హామీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మాదే. జాతీయ, అంతర్జాతీయ సమస్యల కారణంగా బొగ్గు కొరత ఏర్పడింది. అయినా సూర్య భగవానుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే సౌర విద్యుత్తు మనకు పుష్కలంగా అందుబాటులో ఉంటుంది. తద్వారా వ్యవసాయ రంగానికి 25 ఏళ్ల పాటు పగటిపూట నాణ్యమైన కరెంటును అందించవచ్చు. ఎస్ఈసీఐ మొదటి విడతలో సెప్టెంబరు 2024 నుంచి 3000 మెగావాట్ల సౌర విద్యుత్తును, రెండో విడతలో సెప్టెంబరు 2025 నుంచి 3 వేల మెగావాట్లు, మూడో విడతలో సెప్టెంబరు 2026 నుంచి 1000 మెగావాట్లు వరకు సరఫరాను ప్రారంభిస్తుంది” అని మంత్రి తెలిపారు.
బొగ్గు కొరత దృష్ట్యా, బొగ్గును దిగుమతి చేసుకోవటానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీజెన్కోను ఆదేశించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్లో (2×800 మెగావాట్లు) ఉత్పత్తిని పెంచడానికి ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే లక్ష టన్నుల దిగుమతి చేసుకున్న మెరుగైన గ్రేడ్ బొగ్గు కోసం టెండర్లు పిలిచినట్లు చెప్పారు. అలాగే కేంద్ర విద్యుత్తు శాఖ ఆదేశాల మేరకు ఏపీజెన్కో 18 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం, ఏపీపీడీసీఎల్ 13 లక్షల టన్నుల బొగ్గు కోసం టెండర్లు ఆహ్వానించనున్నట్లు వివరించారు. మొత్తం టెండర్ల ప్రక్రియను ఒక్క నెలలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. బొగ్గు దిగుమతికి సంబంధించిన (ఇంపోర్టెడ్ కోల్) టెండర్లను సోమవారం ఆహ్వానించేందుకు అవాకాశముందని ఇంధన శాఖ కార్యదర్శి బీ శ్రీధర్ మంత్రి కి వివరించారు .
విద్యుత్తు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కృష్ణపట్నం థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఫేజ్ 2లోని 800 మెగావాట్ల ప్లాంటును సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి జెన్కోను ఆదేశించారు. ఈ ప్లాంటును నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారానికల్లా ప్రారంభించాలని స్పష్టం చేశారు.
బొగ్గు కొరత కారణంగా దేశంలోని హర్యానా , ఉత్తర్ ప్రదేశ్ , బీహార్, రాజస్థాన్ , కేరళ , పంజాబ్ , జమ్మూ కాశ్మీర్ , మధ్య ప్రదేశ్ , ఒడిశా , తమిళనాడు తదిదర 15 పెద్ద రాష్ట్రాలతో పాటు రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై లాంటి మహానగరాల్లో కూడా విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నారని గ్రిడ్ అధికారులు మంత్రి పెద్దిరెడ్డికి వివరించారు. విద్యత్తు కొరత తాత్కాలిక సమస్యేనని, వినియోగదారులు విద్యుత్తు సంస్థలకు సహకరించాలని మంత్రి కోరారు. సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడంలో ఏపీ నంబర్ 1గా ఉందని, విద్యుత్తు సంస్థలు చౌక విద్యుత్తుపై దృష్టి సారించాలని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్ కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మాజనార్దన్ రెడ్డి, కె.సంతోషరావు, ట్రాన్స్ కో డైరెక్టర్ ఏవీకే భాస్కర్, జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖరరాజు, ఆంటోనీ రాజా, బి.వెంకటేశులు రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.