-జగనన్న పాలనలో విద్యాదీవెన ఓ మైలురాయి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు చదువు భారం కాకూడదనే మహోన్నత ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మరీముఖ్యంగా విద్యా దీవెన పథకం ఈ ప్రభుత్వానికి ఒక మైలురాయి అని వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా (జనవరి-మార్చి, 2021-22 త్రైమాసికానికి) సెంట్రల్ నియోజకవర్గంలోని 5,719 మంది విద్యార్థులకు సంబంధించి 5,136 తల్లుల ఖాతాలలో రూ. 4 కోట్ల 41 లక్షల 20 వేల 986 రూపాయలను గురువారం జమ చేయనున్నట్లు ఓప్రకటనలో తెలిపారు. అలాగే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి తొలివిడతలో 5,285 మంది విద్యార్థులకు గానూ 4,748 తల్లుల ఖాతాలలో రూ. 4 కోట్ల 11 లక్షల 94 వేల 837 రూపాయలను జమ చేసినట్లు వెల్లడించారు. పేదరికం చదువుకు అడ్డం కాకూడదని, ప్రతిఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో అమ్మ ఒడి, నాడు– నేడు, విద్యా దీవెన, వసతిదీవెన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రైమరీ స్కూల్ దశ నుంచి విదేశీ విద్య వరకు పేద విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పథకాల ద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్‌లు తగ్గాయని మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అరకొర ఫీజులు చెల్లించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థుల చదువులను బాధ్యతగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఏ ఏడాది ఫీజు రియింబర్స్ మెంట్‌ను అదే ఏడాదిలో చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించని రూ. 1,778 కోట్ల బకాయిలను సైతం క్లియర్ చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల భవిష్యత్ పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని కొనియాడారు. భావితరాల తలరాతలు మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు.