ఇంటర్మీడియేట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం…

-ఈనెల 6 నుండి 24 వరకు ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం..
-రాష్ట్రంలో 10 లక్షల 1 వేయి 850 మంది విద్యార్థులు ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరు కానున్నారు..
-1456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసాం..
-10వ తరగతి పరీక్షలు 2 రోజుల్లో పూర్తి కావస్తున్నవి..
-10వ తరగతి పరీక్షల సంఘటనకు సంబంధించి 60 మందిని అరెస్ట్ చేసాం..
– రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణా ఏర్పాట్లు, ప్రస్తుతం జరుగుచున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణా వివరాలను బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి వివరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 6వ నుండి 24 వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని మంత్రి అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో ఉదయం 8.30 నుండి 9 గంటల లోపుగా రిపోర్ట్ చేయవలసి ఉంటుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల 01 వేయి 858 మంది విద్యార్థులు ఇంటర్మీడియేట్ పరీక్షలు వ్రాయనున్నారని వారిలో మొదటి సంవత్సరానికి సంబంధించి 5 లక్షల 19 వేల 319 మంది, రెండవ సంవత్సరానికి సంబంధించి 4 లక్షల 89 వేల 539 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని మంత్రి అన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి మొత్తం 1456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 736 పోలీస్ స్టేషన్స్ ను స్టోరేజ్ పాయింట్ లుగా గుర్తించి ప్రశ్న పత్రాలను భద్రపరచనున్నామని మంత్రి తెలియజేసారు. ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పోలీస్, విద్యా శాఖలు సంయుక్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని మంత్రి అన్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి తనికీ బృందాలను ఏర్పాటు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాలలోను సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం పరిశీలిస్తుందని ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రెండు దఫాలుగా అన్ని జిల్లాల కలెక్టర్ లు, ఎస్.పి లతో వీడియో కాన్ఫెరెన్స్, టెలి కాన్ఫెరెన్స్ ద్వారా విద్యా శాఖాధికారులు ఇప్పటికే సమీక్షించారన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పరీక్షలు నిర్వహించనున్నదని ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా ఇంటర్మీడియేట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఏప్రిల్ 20 నుండి మే 6 వరకు 10వ తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నామని ఇప్పటికే 5 పరీక్షలు పూర్తి అయినవని బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్ 2 రోజులతో 10వ తరగతి పరీక్షలు పూర్తి అవుతున్నావని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల 22 వేల మంది విద్యార్థులు 10 వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నారని, చిన్న చిన్న సంఘటనలు తప్ప 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, రాజకీయ పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి అన్నారు. విద్యార్థులు, తల్లి తండ్రుల మనో భావాలూ దెబ్బతినేలా మాట్లాడటం మంచిది కాదని మంత్రి అన్నారు. తప్పు జరిగితే చెప్పండి ప్రభుత్వం సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉందని అంతేగాని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో మాస్ కాపీయింగ్ జరిగితే ఏమి చర్యలు తీసుకున్నారని మంత్రి ప్రశ్నించారు. అప్పటికీ ఇప్పటికి టెక్నాలజీ పెరిగిందని కొంతమంది దుర్బుద్ధితో కొన్ని సంఘటనలకు పాల్పడ్డారని వాటికి మొదటిలోనే అడ్డుకట్ట వేసి వారందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు. 10వ తరగతి పరీక్షలలో జరిగిన సంఘటనలకు సంబంధించి 60 మందిని అరెస్ట్ చేశామని, వారిలో 36 మంది ప్రభుత్వ టీచర్ లను విదులనుండి తొలగించి అరెస్ట్ చేశామని, అలాగే ఇద్దరు సబ్ స్టాఫ్ సిబ్బందిని కూడా విదులనుండి తొలగించి అరెస్ట్ చేశామన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి 22 మందిని అరెస్ట్ చేశామని, వారిలో 15 మంది ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ కాగా 7 మంది మాజీ విద్యార్థులను అరెస్ట్ చేశామని మంత్రి అన్నారు. వారిలో 5 గురు మైనర్ లు అని వారిని కౌన్సిలింగ్ చేసి వారి తల్లితండ్రులకు అప్పగించామని, ఇద్దరు మేజర్ లు కనుక వారిని అరెస్ట్ చేశామన్నారు. అరెస్ట్ చేసిన 15 మంది ప్రైవేట్ టీచర్ లు నంద్యాల జిల్లాకు సంబంధించి రామ కృష్ణా హై స్కూల్, సి.ఆర్.పి. హై స్కూల్ టీచర్లు కాగా, చిత్తూర్ జిల్లాకు సంబంధించి నారాయణా స్కూల్, చైతన్యా స్కూల్, ఎన్ ఆర్ ఐ అకాడమీ, కృష్ణా రెడ్డి చైతన్య, కేరళ ఇంగ్లిష్ మీడియం స్కూల్ లకు చెందిన ప్రైవేట్ టీచర్ లు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని మంత్రి అన్నారు. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని, ఇందుకు సంబంధించి ప్రైవేట్ టీచర్ లే కాకుండా ఆయా ప్రైవేట్ పాఠశాలల ఇన్వాల్వ్ మెంట్ ఉన్నదని విచారణలో తెలిస్తే ఆ పాఠశాలల గుర్తింపును రద్దుచేసి బ్లాక్ లిస్ట్ లో పెడతామని మంత్రి అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఇందుకు బాద్యులు అయిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టామని మంత్రి అన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చేలా మా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. సెల్ ఫోన్, వాట్స్ ఆఫ్ ల ద్వారా పరీక్షలకు ఆన్సర్ చేసేందుకు ప్రయత్నం చేసారని కృష్ణా జిల్లా ఉయ్యురు లో 5 గురు టీచర్ లు పేపర్ రెడీ చేస్తుండగా పట్టుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మాస్ కాపీయింగ్ ను అరికట్టేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వం తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాలు సైలెంట్ గా ఉంటాయా? అని మంత్రి ప్రశ్నించారు. కొందరు ఉపాధ్యాయులు ప్రలోభాలకు లోబడి చేసింది తప్పు అని ఆ సంఘాల వారికి కూడా తెలుసు కనుకే వారు కూడా బాధ పడుతున్నారని మంత్రి అన్నారు. టెక్నాలజీ ని మంచి కోసమే వాడాలని ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని మంత్రి అన్నారు. కొంతమంది స్వార్థం కోసం చేసిన పనిని ప్రభుత్వానికి అంట కట్టవద్దని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసిందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సమావేశం లో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి, ఇంటర్మీడియేట్ బోర్డు కమిషనర్ శేషగిరి రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *