విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జల సంరక్షణతో ఉమ్మడి కృష్ణా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన సర్ ఆర్థర్ కాటన్ జిల్లావాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అపర భగీరథుడి 219 వ జయంతి సందర్భంగా గవర్నర్ పేటలోని నీటి పారుదల కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరు అందించటంలో సర్ ఆర్థర్ కాటన్ చేసిన కృషికి డెల్టా ప్రాంతం అన్నపూర్ణగా వర్ధిల్లుతోందన్నారు. కృష్ణా డెల్టా నేడు పాడి పంటలతో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందంటే.. అది కాటన్ చలువేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సర్ ఆర్ధర్ కాటన్ స్ఫూర్తితో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కృష్ణా డెల్టాను ఆధునికీకరించడం జరిగిందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వరప్రదాయిని అయినటువంటి పులిచింతలను ప్రారంభించి పూర్తిచేసిన ఘనత ఆ మహానేతకే దక్కుతుందన్నారు. జలయజ్ఞం పథకం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా చేశారన్నారు. జిల్లాలో డ్రెయిన్లు, వంతెనల నిర్మాణాలు వైఎస్ హయాంలో నిర్మించినవే అని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన కృషి వల్ల నేడు జిల్లా వ్యవసాయానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. వైఎస్ ఆశయాలను కొనసాగిస్తూ.. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ, సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ.. జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు. పోలవరం నిర్మాణాన్ని సైతం త్వరితగతిన పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు. రాబోవు రోజుల్లో సర్ ఆర్దర్ కాటన్ స్ఫూర్తితో ఆ మహనీయుని ఆశయ సాధన కోసం.. రైతన్నల అభ్యున్నతి కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ డివిజన్ ఇంచార్జి ఆత్మకూరు సుబ్బారావు, డివిజన్ కో ఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాయకులు వడ్డి వాసు, నాడార్స్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …