Breaking News

ప్రజల్లో ప్రభుత్వంపై అంతులేని విశ్వాసం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-29 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు కార్యక్రమానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడేళ్లలో జగనన్న ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వాడవాడలా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26 వ డివిజన్ – 29 వ వార్డు సచివాలయం పరిధిలోని వీధులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహభరితంగా సాగింది. ప్రకాష్ రావు వీధి నుంచి ప్రారంభమై అనుమోలు శేషగిరిరావు వీధి, గోగినేని వారి వీధి వరకు సాగిన పాదయాత్రలో ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజలు కొనియాడారు. రెండు, మూడు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందామని గృహ యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. రెండో రోజు దాదాపు 517 గడపలను వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. అధికంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, దోమలపై ఫిర్యాదులు అందడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల్లో నీరు పారేలా ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా రెండు పూట్ల ఫాగింగ్, మందు పిచికారీ చేయాలన్నారు. ప్రతి ఇంటి వద్ద పుస్తకం ఏర్పాటు చేసి.. అందులో శానిటేషన్, మలేరియా సిబ్బంది రోజూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. వీధులలో వర్షపు నీరు నిలిచిపోతోందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో, సమస్య పరిష్కార దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే గోగినేని వారి వీధిలో మందుబాబులు, ఆకతాయిలు సంచరించకుండా గస్తీ పెంచాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోను అమలు చేశామా..? లేదా..? అని అడిగిన దాఖలాలు లేవని మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇతర పార్టీ నాయకుల ఇళ్లను సైతం సందర్శిస్తున్నట్లు తెలిపారు. వారివారి కుటుంబాలకు అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ.. సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఒక్క ఏడాదిలోనే లక్షా 75 వేల 163 మంది లబ్ధిదారులకు రూ. 120 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 114 కోట్ల నగదును వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. 29 వ వార్డు సచివాలయ పరిధిలో రూ. 67 లక్షల సంక్షేమాన్ని మూడేళ్లలో అందించినట్లు వెల్లడించారు. అలాగే అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రహదారులు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను చివరి కాలనీ వరకు కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తోన్న ఈ ప్రభుత్వాన్ని చూసి తెలుగుదేశం నాయకులు కడుపు మంటతో రగిలిపోతున్నారన్నారు. కనుకనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న కార్యక్రమాలపై చంద్రబాబు, ఎల్లో మీడియా లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలమయమని మండిపడ్డారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి ప్రజల హక్కుగా పాలన సాగిస్తోన్న వైఎస్సార్ సీపీని ఎదుర్కొనే ధైర్యం రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని మల్లాది విష్ణు అన్నారు. కనుకనే సిద్ధాంతాలు పక్కనపెట్టి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగానే పోటీచేసి వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈ గురునాథం, ఏఈ(కరెంట్) వెంకట్రావు, దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండ, డివిజన్ కోఆర్డినేటర్ నాగాంజనేయులు, నాయకులు అన్సారీ బేగ్, సిద్ధాబత్తుల రమణ, కోటేశ్వరరావు, చలసాని వెంకటేశ్వరరావు, చల్లా హరికుమార్, బి.అప్పారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *