-ఎమ్మెల్యే చేతులమీదుగా వృద్ధ దివ్యాంగురాలికి వీల్ చైర్ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం చేయూతనందిస్తునట్లు, దేశంలో ఏ రాష్ట్రం చేయటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ నందమూరి నగర్ కు చెందిన ఎన్. శారదాంబ అనే వృద్ధ దివ్యాంగురాలికి.. విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన వీల్ ఛైర్ ను మంగళవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు ఆమె తనయుడికి అందజేశారు. దివ్యాంగుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే దివ్యాంగులకు నెలవారీ పెన్షన్ ను రూ.3 వేలకు పెంచినట్లు మల్లాది విష్ణు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2,423 మంది దివ్యాంగులకు ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటుగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు కూడా మంజూరు చేస్తున్నట్లు వివరించారు. విద్యా, ఉపాధి అవకాశాలను పొందేవిధంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి సెంటర్లు, వృత్తి విద్యా ట్రైనింగ్ సెంటర్లలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వారంతా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించి దివ్యాంగుల పట్ల సేవా నిరతిని చాటుకుంటున్నారన్నారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన దివ్యాంగులకు అవసరమయ్యే ఉపకరణాలు అందించేందుకు ఇటీవల సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం ఉన్నత పాఠశాలలో పెద్దఎత్తున ఒక శిబిరాన్ని కూడా నిర్వహించినట్లు వివరించారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని, అన్నిరంగాల్లో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం నిలబెట్టే ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని మరోసారి పునరుద్ఘాటించారు.