Breaking News

సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల వైపు అడుగులు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-59వ డివిజన్ 235 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ.. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బుధవారం 59 వ డివిజన్ – 235 వ వార్డు సచివాలయం పరిధిలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాలతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. లెనిన్ సెంటర్ బ్లాక్ 24 నుంచి బ్లాక్ 30 వరకు, కోలా భూషణం వీధులలో విస్తృతంగా పర్యటించి.. సుమారు 160 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ప్రాంత ప్రజలు ఆప్యాయంగా పలకరించారు, కర్పూర హారతులు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు. ప్రజల చల్లని దీవెనలతో సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా తమను సాదరంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 95 శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అటువంటి ముఖ్యమంత్రి మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలన్నా ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవుతోందన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక రూపమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. కరోనా కష్ట సమయంలో వాలంటీర్లు అందించిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. సంక్షేమ పథకాలకు వాలంటీర్లే రథసారథులని కొనియాడారు. పని మీద మద్రాసు వెళ్లిన రొంపల్లి లలిత అనే మహిళ కాపు నేస్తం పథకానికి దరఖాస్తు చేసేందుకు.. అక్కడ అందుబాటులో ఉన్న వాలంటీర్ తో మాట్లాడి బయోమెట్రిక్ వేసేలా చేసిన వాలంటీర్ రాధను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయింనందుకు గత పాలకులు సిగ్గుపడాలన్నారు. పైగా సంక్షేమ పథకాలపై బురద చల్లేందుకు పచ్చ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. విమర్శలు గుప్పించే ప్రతిపక్ష నాయకులు ఒక్కరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటే పేదల గుండె చప్పుడు ఏవిధంగా ఉందో తెలుస్తుందన్నారు. జూలై నెలలో పేదలందరికీ పెద్దఎత్తున ఆర్థిక లబ్ధి చేకూర్చడంలో భాగంగా జూలై 5 న జగనన్న విద్యాకానుక, జూలై 13న వాహనమిత్ర, జూలై 22 న కాపునేస్తం, జూలై 26 న జగనన్న తోడు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అన్ని పథకాలలో మిగిలిపోయిన లబ్ధిదారుల కోసం జూలై 26 న రాష్ట్ర ప్రభుత్వం వారివారి వ్యక్తిగత ఖాతాలలో నిధులు జమ చేస్తుందని వెల్లడించారు. కట్ చేస్తోంది పథకాలను కాదని.. తెలుగుదేశం నాయకులను రాష్ట్ర ప్రజలు కట్ చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు.

సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా నిధుల సమస్య లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా 26 ప్రభుత్వ పాఠశాలల్లో 163 అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 19.56 కోట్ల నిధులతో పాటు.. ఆయా పాఠశాలల మరమ్మతులకు రూ. 12.17 కోట్లు మొత్తం రూ. 31.73 కోట్ల నిధులను వెచ్చించినట్లు వివరించారు. కానీ పేదలకు నాణ్యమైన విద్య అందకూడదనే దురుద్దేశంతో ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ రంగం పూర్తిగా కుదేలైందని.. ఈ ప్రభుత్వం స్వల్పంగా ఛార్జీలు పెంచకుండా ఉండి ఉంటే పవర్ కట్ లతో రాష్ట్రం అల్లాడేదని అభిప్రాయపడ్డారు. గత తెలుగుదేశం చేసిన తప్పులకు రాష్ట్రం అంధకార ప్రదేశ్ గా మారకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజల వద్దకు వెళ్లి తాము సరిదిద్దుతున్నట్లు వివరించారు. టిడ్కో ఇళ్ల విషయంలో చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేస్తే.. తాము అధికారంలోకి రాగానే వారందరికీ న్యాయం చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, ఏసీపీ రమణమూర్తి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై సౌజన్య, నాయకులు హఫీజుల్లా, హనీఫ్, వేణు, గోనెల కృష్ణ, గోనెల నాగరాజు, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నందెపు సురేష్, పిల్లి లక్ష్మి, కొండా లక్ష్మి, శాంతకుమారి, నాగులమీరా, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *