-స్పందనలో… 108 అర్జీలు నమోదు.
-జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన అర్జీలు రీఓపెన్ కాకుండా నిర్ణీతగడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. ప్రతివారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్, డిఆర్ఓ కె. మోహన్ కుమార్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె.సునీతలు అర్జీలు స్వీకరించారు. తక్షణమే పరిష్కరించే అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించి కొన్ని అర్జీలను పరిశీలనకు, విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన అర్జీలకు గడువులోగా పరిష్కారం చూపాలన్నారు ముఖ్యంగా 24 గంటల్లో పరిష్కరించే అర్జీలు పెండింగ్ ఉండరాదన్నారు. అర్జీలు ఏ స్థాయిలోను రీఓపెన్ కాకూడదన్నారు. అర్జీలను నిశితంగా పరిశీలించి అవగాహన కల్పించుకొని అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారం చూపాలన్నారు. అధికారులు సామాన్యుల సమస్యలను ఓపిగ్గా విని పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించలేని పక్షంలో సరైన వివరణ ఇవ్వాలన్నారు. అప్పుడే అధికారులపై గౌరవం వ్యవస్థ పై నమ్మకం పెరుగుతాయని అన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెన్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. స్పందనలో నేడు 108 అర్జీలు నమోదు అయ్యాయని వీటిలో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 41, పోలీస్ శాఖ-18, మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ మరియు అర్బన్ డెవలప్మెంటుకు-9, హౌసింగ్-6, మెడికల్ అండ్ హెల్త్-4, పంచాయితీ రాజ్-4, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ-4,విద్యాశాఖకు-4 మిగిలిన ఇతర శాఖలకు సంబంధించి మొత్తంగా 108 అర్జీలు నమోదు అయ్యాయని కలెక్టర్ డిల్లీ రావు అన్నారు.
స్పందనలో ప్రధానంగా నమోదైన అర్జీలు….
-నగరంలోని సింగ్ నగర్ రాజరాజేశ్వరి పేటకు చెందిన షేక్ ఆసియా బేగం అర్జీ ఇస్తూ తనకు చెందిన ఖాళీ స్ధలం సబ్ డివిజన్ అయిందని ఇందుకు సంబంధించిన రికార్డును పరిశీలించి సబ్ డివిజన్ సర్టిఫికెట్ ఇప్పించాలని అర్జీ సమర్పించారు.
-నందిగామ మండలం మోగల్లు గ్రామానికి చెందిన చలసాని శ్రీనివాసరావు అర్జీ ఇస్తూ తన పేరుతో ఉన్న ఖాళీ నివేశన స్థలాన్ని జాతీయ రహదారి విస్తరణలో ప్రభుత్వం తీసుకుందని ఆ స్థలానికి నష్టపరిహారం ఇప్పించాలని అర్జీ సమర్పించారు.
-నగరానికి చెందిన రాయన చాముండేశ్వరి అర్జీ ఇస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో తన దరఖాస్తును ఆన్లైన్ చేయాలని ప్రస్తుతం తన ఉంటున్న ఇల్లు పాడై కూలిపోయే పరిస్థితిలో ఉందని అర్జీ సమర్పించారు.
– నిడమానూరుకు చెందిన మస్ జిద్ సెహన్ అహలే హదీస్ ముస్లిం సొసైటీ కమిటీ సభ్యులు అర్జీ ఇస్తూ గత 40 సంవత్సరాలుగా నిడమానూరు రైల్వే స్టేషన్ కట్టమీద పూర్వీకుల నుండి నివాసం ఉంటున్నామని 20 సంవత్సరాలుగా ప్రతినిత్యం ఐదు పూట్ల నమాజు ప్రార్థనలు చేసుకుంటున్నామని, రైల్వే మూడవ లైన్ విస్తరణలో మసీదును తొలగించకుండా తగు చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ స్ధలాన్ని చూపాలని కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అర్జీ సమర్పించారు.