-30 డివిజన్ లో అభివృద్ధి పనుల పర్యవేక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 డివిజన్ లో జరుగుతున్న ప్రగతి పనులను స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి మంగళవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీవీఆర్ నగర్, దావు బుచ్చయ్యకాలనీలలో జరుగుతున్న యూజిడి ట్రంక్ లైన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం వినాయకనగర్ వాసులకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడకుండా సమాంతరంగా ఏర్పాటు చేస్తున్న 3 రోడ్లను పరిశీలించారు. పనుల్లో జాప్యం జరగకుండా త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గత మూడేళ్లలో డివిజన్లో రూ.9.92 కోట్ల నిధులతో 8.69 కి.మీ. పొడవున రహదారుల పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. రూ. 10.40 కోట్ల నిధులతో మంచినీటి సౌకర్యం మెరుగుపర్చడంతో పాటు రూ.9.20 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు వివరించారు. ఇందులో చాలా వరకు పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధికి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారంతోనే అభివృద్ధి సాధ్యపడిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు స్పష్టం చేశారు.