-యువతను చైతన్యవంతులు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల చర్యలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం అని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
సేఫ్ డ్రైవింగ్ సేఫ్ లివ్స్ వినాదంతో రహదారి భద్రతపై కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత అనేది సమాజంలో సామాజిక ఆర్థిక సమస్యగా ఉందన్నారు. ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం వీధిన పడుతుందన్నారు. రహదారి భద్రత సాధించాలంటే అందరూ భాగస్వాములు కావాలన్నారు. రహదారి భద్రతకు కేవలం రవాణా, పోలీస్, ఇంజనీరింగ్, మొడికల్ విభాగాల బాధ్యత మాత్రమే కాకుండా స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా అవసరం అన్నారు. మన జిల్లాలో నెలకు సుమారు 100 నుండి 120 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిలో కనీసం 20 వరకు మరణాలు ఉంటున్నాయన్నారు. ప్రమాదాలు నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 210 కళాశాలలు ముఖ్యంగా 18 వరకు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రవాదారి భద్రతపై అవగాహన కల్పిస్తామన్నారు. కళాశాలలో యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అదించడం ద్వారా పూర్తి స్థాయిలో అన్ని కళాశాలలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా రవాణా శాఖ జారీ చేసే విధివిధానాలు, డ్రైవింగ్ స్కిల్క్, వాహనదారులు పాటించే నియమనిబంధనలు ఉంటాయన్నారు. రహదారి భద్రతలో విద్యార్థుల పాత్ర అనేది అశంగా తీసుకొని కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రమాదాల్లో 60 శాతంపైగా యువత తప్పిదాల వల్లే జరుగుతున్నట్లు నివేదికలో తెలుపుతున్నాయన్నారు. ఈ ప్రమాదాలను ఏ విధంగా నివారించాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టామని దీనిలో భాగంగా విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపై లక్ష్యంగా నిర్థేశించామని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ ఎం పురేంద్ర మాట్లాడుతూ ఆగస్టు మూడవ వారం నుండి కళాశాలలో రహదారి భద్రత పై కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం వల్ల వచ్చే నష్టం ఆ లైసెన్స్‌ను ఏ విధంగా పొందాలి, అతివేగం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇంజనీరింగ్ నిపుణులు తయారుచేసిన సీట్ బెల్ట్, హెల్మెట్‌లను నిర్లక్ష్యం చేయకుండా వాటిని గౌరవించి ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలను ఆరికట్టవచ్చునన్నారు. ప్రతీ కళాశాలలో 20 నుండి 25 మంది విద్యార్థులను గుర్తించి వారికి వాలంటీర్లుగా శిక్షణ ఇచ్చి అన్ని కళాశాలలో అవగాహన కల్పిస్తామని డిటిసి అన్నారు.
ఈ కార్యక్రమంలో సూట్స్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో డా. కె. సోమశేఖర్‌రెడ్డి, వీడు రోడ్ సేప్టీ ఎన్జీవో ఫౌండర్ డైరెక్టర్ ఎం వాసు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు.