Breaking News

విజయవాడ వేదికగా అక్టోబరు 14 నుండి 18 వరకు సిపిఐ జాతీయ మహాసభలు

-మహాసభల వాల్‌పోస్టరు, కరపత్రాల ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయోద్యమ కాలం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రజా పోరాటాలకు వేదికగా, రాజకీయ రాజధానిగా నిలిచిన విజయవాడ నగరం భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) 24వ జాతీయ మహాసభల చారిత్రాత్మక ఆతిథ్యానికి శ్రీకారం చుట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. విజయవాడ ఎస్‌ఎస్‌ కల్యాణ మండపం వేదికగా అక్టోబరు 14 నుంచి 18వరకు జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల వాల్‌ పోస్టరు, కరపత్రాలను విజయవాడ దాసరిభవన్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, జి.ఓబులేసు, అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, కె. రామాంజనేయులు, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావులతో కలిసి ఆయన విడుదల చేశారు.
రామకృష్ణ మాట్లాడుతూ, 24వ జాతీయ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత నెలకొందని, మోదీ అనుసరిస్తున్న పాలనకు వ్యతిరేకంగా, దేశ వ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు అందర్నీ ఏకం చేయడానికి సిపిఐ జాతీయ మహాసభలు ఒక వేదిక కానున్నాయని వెల్లడిరచారు. ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించాల్సిన మహాసభలు కరోనా వల్ల నాలుగేళ్లు గడిచాయన్నారు. సీపీఐ జాతీయ మహాసభలు 47ఏళ్ల తరువాత విజయవాడలో నిర్వహించాలని జాతీయ కమిటీ నిర్ణయించిందన్నారు. ఇదే విజయవాడలో 1961లో సీపీఐ 6వ జాతీయ మహాసభలు, 1975లో 10వ మహాసభలు జరిగాయని, 47 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ 24వ జాతీయ మహాసభలను ఘనంగా జరుపుకోనున్నామని వివరించారు. మహాసభల సందర్భంగా అక్టోబర్‌ 14న విజయవాడలో భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామని, దీనికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితర నాయకులు పాల్గొంటారని తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి వేయి మంది మంది ప్రతినిధులు వస్తున్నారని, ఇతర దేశాలలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. సీపీఎం నుంచి సీతారామ్‌ ఏచూరి, ఇతర వామపక్ష పార్టీల జాతీయ నాయకులు సౌహార్ధ సందేశం ఇస్తారన్నారు. ఈ మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని, మోదీ ప్రభుత్వం కేంద్రంలో నియంత పాలన చేస్తున్నదన్నారు. ప్రతిపక్షాలను అణచివేయడానికి వ్యవస్థలను వాడుకుంటూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశం అన్నివిధాలా నష్టపోయిందని, ప్రజాస్వామ్యానికి పాతరేసి, ఏక వ్యక్తి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే అన్యాయంగా జెళ్లల్లో పెడుతున్నారన్నారు. ఇళ్లకు సీబీఐ, ఐటీ వాళ్లని పంపి బెదిరిస్తున్నారని, ఇటీవల సోనియా గాంధీని కుడా విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారని చెప్పారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశాన్ని అప్పుల పాల్జేశారని, బ్లాక్‌ మనీ తేలేదనీ, ఉద్యోగాలు లేవని విమర్శించారు. మోదీ అధికారం చేపట్టే నాటికి రూ.47లక్షల కోట్లు అప్పు ఉంటే, ఇవాళ రూ.155 లక్షల కోట్లకు చేర్చారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు కూడా ప్రైవేటు పరం చేశారని మండిపడ్డారు. ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పని ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారన్నారు. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెరిగి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వం కార్పొరేట్‌ శక్తులకు మోదీ ఊడిగం చేస్తున్నారని, మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే అంబేద్కర్‌ రాజ్యాంగం కూడా మూలన పడేయడం ఖాయమన్నారు. పేద, ధనికుల మధ్య అంతరాయం పెరిగిపోతోందని పేర్కొన్నారు. పూర్తిగా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారనీ, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రధానులు నెహ్రూ నుంచి మన్మోహన్‌సింగ్‌ వరకు పరిశ్రమలను నెలకొల్పి జాతికి అంకిత చేయగా, మోదీ హయాంలో ఒక్క పరిశ్రమను సైతం నిర్మించలేక పోయారన్నారు. పైపెచ్చూ ఉన్న వాటిని కార్పొరేట్‌కు తెగనమ్ముతున్నారని, ప్రైవేట్‌ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ మోదీ విస్మరించారని, మోదీ పాలనతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. జగన్‌, చంద్రబాబు పోటాపోటీగా మోదీకి నిస్సిగ్గుగా భజన ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు మోదీతో చేయి కలిపారని, మోదీతో జగన్‌ కలిసి భోజనం చేశారంటూ వారిని వారే డిగ్రేడ్‌ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ చేయి వేస్తే పులకరించి పోవడం సరికాదన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి ఏమి అడక్కుండా పూర్తిగా దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి ఒక ఆర్టిస్ట్‌ అని, రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడుతున్నట్లు ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ఎపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోరాటాలు వదిలి, ఇవాళ వాట్సాప్‌లలో పోరాటాలు చేస్తున్నారన్నారు. ఎంపీలు అసలేం చేస్తున్నారో అర్థం కావడం లేదనీ, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అవకుండా వారేం చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దిల్లీలో చంద్రబాబు, జగన్‌ తాకట్టు పెట్టొద్దని, అధికారం ఉంటుందీ, పోతుందనీ, వారిద్దరూ వ్యక్తిత్వంతో మెలగాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్నారనీ, మహాసభలు వేదికగా ఈ అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు. వామపక్ష, ప్రజాతంత్రవాదులను ఐక్యం చేస్తామన్నారు. అక్టోబరులో జరిగే జాతీయ మహాసభలను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ మహాసభలు, ఉద్యమాల నిర్వహణలో విజయవాడ ఎంతో పేరొందని చెప్పారు. దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర వాదులంతా ఏకం కావాలని ఆకాంక్షించే వారంతా, రాబోయే పార్టీ జాతీయ మహాసభల విజయవంతానికి విరాళాలిచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జి.ఓబులేసు మాట్లాడుతూ, ఉమ్మడి జాబితాలోని రాష్ట్రాలకు ఉన్న విద్యా, వైద్యం, నీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాలన్నీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకుని సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోందన్నారు. అందులో భాగంగానే విద్యుత్‌ సంస్కరణలను ప్రవేశపెట్టిందన్నారు. 45 కార్మిక చట్టాలను, నాలుగు కోడ్‌లుగా సవరించి, దాని ఆమోదించడానికి తిరుపతిలో అన్ని రాష్ట్రాల కార్మిక శాఖాధికారులు, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయనుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలని, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *