– పందెంలో పాల్గొన్నా చట్టరీత్యా నేరమే
– నిబంధనల అమలు చేసేందుకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు
– జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని… ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కే. చంద్రశేఖర రావు హెచ్చరించారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో ఎక్క డా కోడి పందాలు జరక్కుండా తీసుకోవలసిన చర్యలపై
రాష్ట్ర పశుసంవర్థక శాఖ కోడి పందాల నిషేధంపై రూపొందించిన పోస్టర్లను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్-1974 సెక్షన్-10, జంతుహింస నివారణ చట్టం-1960 సెక్షన్ 34 ప్రకారం కోడి పందాలను నిషేధించడం జరిగిందన్నారు. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కోడి పందాల నివారణకు హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సంయుక్త తనిఖీల బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామస్థాయి బృందంలో వీఆర్‌వో, పోలీస్ కానిస్టేబుల్, పశుసంవర్థక శాఖ సిబ్బంది ఉంటారని.. మండలస్థాయి బృందంలో తహసీల్దార్, ఎస్‌హెచ్‌వో, మండల పశుసంవర్థక అధికారి ఉంటారన్నారు. జిల్లాస్థాయి బృందంలో ఆర్‌డీవో/సబ్ కలెక్టర్, డీఎస్‌పీ/ఏసీపీ, పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ బృందాలు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, చట్టాల్లోని అంశాలను వివరించాలన్నారు. పందెం నిర్వహించినా, పాల్గొన్నా చట్ట ప్రకారం నేరమేనని పేర్కొన్నారు. ఎక్కడా పందెం బరులు ఏర్పాటుకాకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. నిబంధనల మేరకు తహసీల్దార్లు, ఆర్‌డీవోలు వారి పరిధిలోని పంచాయతీలకు నోటిఫికేషన్లు జారీచేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పందాలు జరక్కుండా గట్టి నిఘా ఏర్పాటుచేసి, తనిఖీలను ముమ్మరం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎన్ సి హెచ్ నరసింహులు, సూపరిండెంట్ మురళీకృష్ణ ఏవో వీరాంజనేయ ప్రసాద్ ఉన్నారు.
Prajavartha Online Telugu News