-వరదల వల్ల లోయర్ కాఫర్ డ్యాం పనులకు ఆటంకం
-లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్‌లు పూర్తవకుండానే డయాఫ్రమ్‌వాల్ కట్టడం గత ప్రభుత్వ చారిత్రాత్మక తప్పిదం
-ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానంతో రూ.800 కోట్లు ఆదా
-జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి రెండోసారి, కృష్ణా నదికి తొలిసారి వరదలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. బుధవారం విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సూచించారని ఆయన తెలిపారు. ఇప్పటికే జలవనరుల శాఖ వరదలకు సంబంధించిన నివేదిక తెప్పించుకొని ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించిందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని శ్రీశైలం, పులిచింతల తదితర ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కళకళలాడుతున్నాయన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక దుష్ప్రచారాలు వెలువడుతున్నాయని.. ప్రజలు వాటిని నమ్మవద్దని చెబుతూ అందుకు గల కారణాలను మంత్రి అంబటి రాంబాబు విశ్లేషించారు. జులై 31 లోగా లోయర్ కాఫర్ డ్యాం పనులు పూర్తిచేయమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆదేశించిన మాట వాస్తవమేనన్నారు. కానీ జూలై8వ తేదీనే గోదావరికి ముందస్తుగానే వరదలు రావడంతో కాఫర్ డ్యాం పనులకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. పనులు ఆగడానికి గల కారణాలను తెలుపుతూ గురువారం పీపీఏకు లేఖ రాస్తామన్నారు.
లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండానే పోలవరం ప్రాజెక్టు వద్ద డయాఫ్రమ్‌వాల్ కట్టడం గత ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్పిల్ వే పూర్తిచేయకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు వద్ద భయంకరమైన నీటి గుంటలు ఏర్పడటమే గాకుండా ప్రస్తుత వరదల వల్ల డయాఫ్రంవాల్ మునిగి పనులేవీ చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో భారీగా నష్టం వాటిల్లడమే గాకుండా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. ఇప్పటికే డిజైన్ ల విషయంలో ఆలస్యమైందని, వర్షాలు, వరదల ధాటికి ఏర్పడ్డ గుంటలను పూడ్చేందుకు జియోబ్యాగ్స్ ను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి వాటిని పూడ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖలతో సమన్వయం చేసుకొని సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుందన్నారు. గోదావరి వరదల వల్ల ప్రజలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కొందరు ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని, అవి అన్నీ అవాస్తవాలని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని వెల్లడించారు.