విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం మనపై ఉంచిన భాధ్యతలను విస్మరించరాదని లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని అలసత్వం వహిస్తే ఉపేక్షించ బోనని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలక్టరేట్ నుండి గృహ నిర్మాణాల ప్రగతిపై బుధవారం కలెక్టర్ డిల్లీరావు ఎంపీడీవోలు తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణశాఖ ఏఈలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి ప్రతి పేదవానికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో గురుతర బాధ్యతలను మనకు అప్పగించడం జరిగిందన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చినపుడు వారి కళ్ళలో ఆనందం మనపై చూపించిన ప్రేమ ఎంతో సంతృప్తిని ఇస్తాయన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో అలసత్వం ప్రదర్శించడం సహించరానిదన్నారు. ఇప్పటికైనా గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టండని నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అన్నారు. గృహ నిర్మాణాలలో జిల్లాను అగ్రగామిగా నిలపటంలో భాగస్వామ్యలు కావాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులకు సూచించారు. వారం వారిగా నిర్దేశించిన లక్ష్యాలను మండలాల వారిగా సంబంధిత అధికారులతో కలెక్టర్ డిల్లీరావు సమీక్షించారు. లక్ష్యాల సాధనలో వెనుకబడిన మండలాల గృహ నిర్మాణ శాఖ అధికారులను అందుకు తగిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ పరిధిలో ప్రారంభంకాని, బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న 10,711 గృహ నిర్మాణాలకు ఈ వారం నిర్దేశించిన లక్ష్యాలను, నందిగామ, తిరువూరు, కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలోని ప్రారంభం కాని, బిలో బేస్మెంట్ స్థాయి ఈ వారం నిర్దేశించిన 1,234 లక్ష్యాలను, వీటితోపాటు విజయవాడ రూరల్, వత్సవాయి, మైలవరం, జి.కొండూరు, పెనుగంచిప్రోలు, నందిగామ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట మండలాల పరిధిలో ప్రారంభం కాని, బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, బేస్మెంట్ స్థాయిలో ఉన్నవాటిని రూప్‌లెవల్ స్థాయికి రూప్‌లెవల్ స్థాయిలో ఉన్నవాటిని ఫినిషింగ్ స్థాయికి తీసుకురావాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడివోలు, తహశీల్థార్లు, మున్సిపల్ కమీషనర్లను కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, హౌసింగ్ పిడి శ్రీదేవి, ట్రైనీ డిప్యూటి కలెక్టర్లు రామలక్ష్మి, భాను, తదితరులు ఉన్నారు.