-అధికారభాషా సంఘానికి లేనటు వంటి విశేషమైనఅధికారాలు ఈసంస్థకు ఇచ్చారు
-పాలనా భాషగా తెలుగును అమలు పర్చని అధికారులు,సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం
-తెలుగుభాషా వికాసానికి,పరిరక్షణకు సి.ఎం.జగన్ తీసుకున్న నిర్ణయాలు అమోఘం
-గత ప్రభుత్వంలో మూసివేసిన తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం ఏర్పాటు
-తెలుగు భాషా దినోత్సవంగా ఆగష్టు 29 న గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు
-రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత రెండు దశాబ్దాలుగా తెలుగు భాషాభిమానుల చిరకాల కోరిక అయిన తెలుగు భాషా ప్రాధికార సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధికార భాషా సంఘానికి లేనటు వంటి విశేషమైన అధికారాలను ప్రభుత్వం ఈ సంస్థకు కట్టబెట్టిందని ఆయన తెలిపారు. తెలుగు అధికార భాషగా అమలు జరుగుతున్న తీరును డివిజనల్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమీక్షించే అధికారం ఈ సంస్థకు ఉందన్నారు. తెలుగును అధికార భాషగా అమలు చేయనటు వంటి అధికారులు, శాఖాధిపతులు, సంస్థలపై జరిమానాలు, జైలు శిక్షలు విధించే అధికారం ఈ తెలుగు భాషా ప్రాధికార సంస్థకు ఉందన్నారు. అదే విధంగా నామ ఫలకాలు, బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు మరియు ఇతర ప్రచార సామాగ్రి తెలుగు భాషలో ఉండేటట్లుగా ఉత్తరువులను ఇచ్చి, వాటిని ఉల్లంఘించిన వారికి శిక్షలు, జరిమానాలు విధించే అధికారం ఈ సంస్థకు ఉందన్నారు. ఈ సమాచారాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు, శాఖాధిపతులకు, కార్యదర్శులకు పంపడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.శమీర్ శర్మను కూడా కలిసి ఇదే విషయాన్ని స్పష్టం చేశామని, వారి కార్యాలయం నుండి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ అంశంపై అదేశాలు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.
సెప్టెంబరు మొదటి వారం నుండి ఈ తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ ప్రతి జిల్లాకు వెళ్లి జిల్లా కలెక్టర్ల ఆద్వర్యంలో ఆ జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థకు ఉన్న విశేష అధికారాలను వివరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. తెలుగును పాలనా భాషగా అమలు పర్చే కార్యక్రమంలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, వారిని చైతన్య పర్చడంలో అన్ని ప్రచార మాధ్యమాలు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలుగు భాషా వికాసానికి, పరిరక్షణకు ముఖ్యమంత్రి నిర్ణయాలు అమోఘం…..
తెలుగు భాషకు, భాషా వికాసానికి, పరిరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో లేనటు వంటి తెలుగు అకాడమీని ప్రస్తుత ప్రభుత్వం పునరుద్దరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తలుపులు మూసేసి అస్తిత్వమే లేకుండా చేసినటు వంటి తెలుగు భాషా సంఘాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పున:నియమించారని తెలిపారు. జిల్లాల పునర్విభజనకు ముందున్న 13 జిల్లాలో తెలుగు భాషా సంఘం పర్యటించి పాలనా భాషగా తెలుగు అమలును సమీక్షించి తగు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు.
తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తరలించడం జరిగింది…
స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చిందన్నారు. ఆ తదుపరి మైసూరులోనున్న భారతీయ భాషల విధ్యాలయంలోనే తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రం కొనసాగిందని ఆయన తెలిపారు. అయితే తమిళ భాషకు ప్రాచీయ భాష హోదా వచ్చినప్పుడు అక్కడి ముఖ్యమంత్రి కరుణానిధి తమిళ భాష ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని చెన్నైకు తీసుకు వెళ్లి పోయారన్నారు. తదుపరి మనకు ప్రాచీన భాష హోదా వచ్చిన నేపథ్యంలో తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని మన రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు కేంద్రం అనుమతినిచ్చిందన్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో హైద్రాబాదులో తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రానికి సరైన వసతి కల్పించకపోవడం వల్ల ఆ ప్రతిపాదన వెనక్కు వెళ్లిపోయిందన్నారు. అయితే శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తదుపరి వారి సూచనల మేరకు తిరిగి తెలుగు భాష ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తరలించడం జరిగిందన్నారు. ఈ కేంద్ర ఏర్పాటుకు నెల్లూరులో ఐదు ఎకరాల భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు.
తెలుగు భాషా దినోత్సవంగా గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు…
తెలుగు భాషా దినోత్సవంగా వాడుక భాషా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులు 159 వ జయంతి ని ఈ నెల 29 న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఆ రోజు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గిడుగు రామ్మూర్తి పంతులు గారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పిస్తారన్నారు.
గిడుగు రామ్మూర్తి కార్యక్షేత్రం విశాఖపట్నం అయిన నేపథ్యంలో మరియు వారి జన్మస్థలం కూడా ఉత్తరాంధ్రా జిల్లాలోనే ఉండటం చేత రాష్ట్ర స్థాయి తెలుగు భాషా దినోత్సవాన్ని ఈ నెల 29 న విశాఖపట్నంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. తెలుగు భాష కోసం ఉధ్యమాలు చేసిన వారిని మరియు తెలుగు భాషా వికాసానికి, పరిరక్షణకు కృషి చేసిన వారిని దాదాపు 40 మందిని గుర్తించి వారికి ఈ రాష్ట్ర స్థాయి వేడుకల్లో సత్కారం, ప్రశంసా పత్రంతో పాటు ఒక్కొక్కరికీ రూ.15 వేల నగదు పురస్కారాన్ని కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
తెలుగు వారిని అందరినీ ఈ వేడుకల్లో భాగస్వామ్యులను చేయాలనే లక్ష్యంతో అన్ని జిల్లా కేంద్రాల్లో తెలుగు భాషా దినోత్సం వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలను పంపడం జరిగిందన్నారు. జిల్లాల వారీగా స్థానికంగా ఉన్నటు వంటి తెలుగు సాహితీ వేత్తలను, భాషాభిమానులను గుర్తించి సన్మానించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సి.ఇ.ఓ. మల్లికార్జున రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.