పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హత ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఆర్ధిక సాయం అందిస్తున్న ప్రభుత్వం.
రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను కృష్ణా జిల్లా పెడనలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయస్.జగన్.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే….:
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడే వైయస్సార్ నేతన్న నేస్తంగా దాదాపు 80వేల కుటుంబాలకు మంచి చేస్తూ.. సుమారు రూ.200 కోట్లు కార్యక్రమంలో భాగంగా నేరుగా బటన్ నొక్కి నా నేతన్నల కుటుంబాలకు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
ఒక రాట్నం, ఒక మగ్గం మారిన దేశం రూపురేఖలు
మన నేతన్నలు మగ్గాల మీద నేసేది కేవలం విడిగా ఉన్న దారాలను కలిపి వస్త్రాలు చేయడం మాత్రమే కాదు.. ఒక రాట్నం, ఒక మగ్గం ఈ దేశం రూపురేఖలను మార్చేసింది.
మన స్వాతంత్య్ర పోరాటం ఒక్కసారి గమనిస్తే.. భిన్న మతాలను, భిన్న కులాలను, భిన్న ప్రాంతాలను, భిన్న భాషలను, ఆచారలన్నింటినీ, ఏకంగా జాతీయ ఉద్యమాన్ని పూర్తిగా ఒక్కటిగా చేయగలిగారు మన నేతన్న.
మన నేత, మన చేనేత అన్నది గొప్పదైన మన సంస్కృతికి, మన చరిత్రకు, మన స్వాతంత్య్ర పోరాటాలకు నిదర్శనాలుగా నిల్చాయి. అటువంటి మగ్గాన్ని, అటువంటి వేల సంవత్సరాల మన చేనేతను నమ్ముకుని ఈ పోటీ ప్రపంచంలో కూడా బ్రతడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతిచోటా గమనిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న కూడా వారికి ఏ ఒక్కరూ కూడా తోడుగా ఉండాలి, ఆదుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు. అటువంటి ఆలోచన, గట్టి అడుగులు ఈ రోజు మీ బిడ్డ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
నేతన్నల జీవితాలను పాదయాత్రలో చూశా…
అద్భుతమైన వస్త్రాలను నేసే… ఈ నేతన్నల జీవితాలు ఎలా ఉన్నాయో నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చాలాచోట్ల గమనించాను. నా కళ్లారా చూశాను. చెప్పిన ఆ బాధలన్నీ విన్నాను. విన్నప్పుడు నేను ఉన్నాను… నేను విన్నాను అని ఆ రోజు ఏదైతే చెప్పానో ఆ చెప్పిన మాటను మర్చిపోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అటువైపు అడుగులు వేశాం.
నేతన్న మీద నా ప్రేమకు నిదర్శనంగా…
మొట్టమొదటిగా 2019లో వైయస్సార్ నేతన్న నేస్తం పథకం నా పుట్టిన రోజు నాడే తీసుకువచ్చాం. మగ్గం మీద నేతన్న మీద ఉన్న నా ప్రేమకు… నా పుట్టిన రోజు నాడు చేసిన కార్యక్రమమే నిదర్శనం. మగ్గం నేస్తున్న, మగ్గం ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునేట్టుగా వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా.. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రూ.24వేలు ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గడిచిన మూడేళ్లగా ఏ ఒక్కసారి మిస్ కాకుండా ప్రతి సంవత్సరం అదే కుటుంబానికి రూ.24 వేలు ఇస్తూ.. ఇప్పటికే రూ. 72 వేలు వారి చేతిలో పెట్టాం.
ఇవాళ నాలుగో సంవత్సరం….
ఈ రోజు నాలుగో సంవత్సరం మగ్గమున్న ప్రతి నేతన్న కుటుంబానికి కూడా మరో రూ.24వేలు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా నేతన్నలకున్న గత అప్పులకు ఈ డబ్బు జమ చేయకుండా ఉండే విధంగా.. అన్‌ఇన్‌కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద మార్చి వారికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నాం. వైయస్సార్ నేతన్న నేస్తం ఒక్క పథకం కిందే రూ.96 వేలు అందించాం.
లంచాలు, వివక్షకు తావులేకుండా…
ఈ రోజు వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా 80,546 మంది కుటంబాలకు రూ.193 కోట్లు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. నేరుగా బటన్ నొక్కి ఆ కుటుంబాలకు డబ్బు చేరుతుంది.
నేతన్నలకు ఇచ్చిన మొత్తం సాయం రూ.2049 కోట్లు
ఇవాళ ఇచ్చే ఈ రూ.193 కోట్లు డబ్బుతో కలిపితే… మూడు సంవత్సరాల కాలపరిమితితో రూ.776 కోట్లు కేవలం వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా ప్రతి కుటుంబానికి దాదాపు రూ.96 వేలు ఇచ్చినట్లవుతుంది. నేతన్న నేస్తం ద్వారా ఇచ్చిన రూ.776 కోట్లు కాక.. నేతన్నలకు సామాజిక ఫించన్‌లు ద్వారా మరో రూ.880 కోట్లు. ఆప్కో ద్వారా మరో రూ.390 కోట్లు చెల్లించాం. ఇలా ఈ మూడు సంవత్సరాలలోనే నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం తరపున చేసిన వ్యయం ఏకంగా… రూ.2049 కోట్లు.భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ఇలాంటి కార్యక్రమం చేయడం లేదు. గతంలో మన రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు మీరు చూశారు. గతంలో మన రాష్ట్రంలో అయినా ఏ ఒక్క ప్రభుత్వమైనా కూడా నేతన్నలకు ఇంతగా అండగా నిలబడిందా ? అన్నది ఒక్కసారి మనస్సాక్షిని అడగండి.
మనందరి ప్రభుత్వం నేతన్నల వృత్తికి, వారి ఆదాయానికి, వారి కుటుంబాలకు తోడుగా ఉంటూ చేసిన వ్యయం వలన..నేతన్నల కుటుంబాలకు ఎలాంటి మంచి జరిగిందో రెండు మాటల్లో చెబుతాను.
అప్‌గ్రేడ్ మిషన్స్…
ఈ ఆర్ధిక సహాయంతో తమ మగ్గాలను జాకార్డ్ లిప్టింగ్ మిషన్స్ వంటి ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం చాలామంది నేతన్నలకు వచ్చింది. కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. సులువుగా మగ్గాన్ని నడపడం మొదలుపెట్టారు. ఇలా ఈ ఆర్ధిక సహాయం వాళ్ల బ్రతుకులను ఏ స్ధాయిలో మార్చింది అన్నది… ఒక్కసారి గమనిస్తే…
2018–19లో నెలకి రూ.4680 మాత్రమే ఉన్న ఆదాయం ఈరోజు వైయస్సార్ నేతన్న నేస్తం దన్నుతో వారు మగ్గాలు అప్‌గ్రేడ్ చేసుకున్నందు వల్ల వారి ఆదాయం ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకు చేరింది. అంతే కాకుండా నేసిన వస్త్రాలకు సరైన ధర లభించేలా మార్కెట్‌లో కూడా విపరీతమైన మార్పులు తీసుకురావడం జరిగింది.
అంతర్జాతీయ మార్కెటింగ్ దిశగా…
వాళ్లందరినీ వాళ్ల కాళ్లమీద నిలబడేలా చేస్తూ ఆప్కో వస్త్రాలను మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కూ పరిచయం చేశాం. నేతన్నల ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తూ.. ఈ కామర్స్ సంస్ధలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకాప్, లూమ్‌ఫోక్స్, మిరావ్, పేటీఎం వంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుని ఆప్కో ద్వారా వస్త్రాలను పూర్తిగా మార్కెటింగ్ చేసే స్దాయిని పెంచాం. ఇంతగా మనసు పెట్టి ఆలోచన చేసి నేతన్నలకు మేలు చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా?
ఒక్కసారి ఆలోచన చేయండి ?
నేతన్నలే కాదు బీసీ సోదరులు, అక్కచెల్లెమ్మలు అందరూ ఆలోచన చేయండి.
మూడేళ్లలో ఏం చేశామో– నాలుగు మాటల్లో….
వారి ఆర్ధిక, రాజకీయ, సామాజిక, విద్య, మహిళా సాధికారతల కోసం మన ప్రభుత్వం మనసు పెట్టి ఈ మూడేళ్ల కాలంలో మనం ఏం చేశామన్నది నాలుగు మాటల్లో చెప్తాను.
శాశ్వత బీసీ కమిషన్…
బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనదే. బీసీ కులాలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వమూ మనదే. బీసీలను బాక్ బోన్ క్లాసులుగా అంటే వెన్నుముక కులాలుగా మారుస్తామని మాట చెప్పాం. ఆ మాట నిలబెట్టుకుంటూ రూ.1 లక్షా 65 వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా బటన్ నొక్కి ప్రతి అక్క, చెల్లెమ్మ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్కచెల్లెమ్మలకే 75 శాతం పైగా డబ్బులు ఇవ్వగలిగాను.
కేబినెట్‌లో…
ఈ రోజు మంత్రిమండలి గమనిస్తే.. మొదటి విడతలో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిస్తే.. రెండో విడతలో 70 శాతం మంత్రిమండలి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఇచ్చాం.
రెండు మంత్రివర్గాల్లో కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే.. అందులో నాలుగు అంటే 80 శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చాం.
శాససనభ స్పీకర్‌గా బీసీ కనిపిస్తారు, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీ ఉన్నారు. శాసనసమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నా మైనార్టీ అక్క కనిపిస్తుంది. సామాజిక న్యాయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీకారం చుట్టాం. ఈ మూడేళ్ల కాలంలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే.. అందులో నలుగురు బీసీలే. శాసనమండలికి అంటే ఎమ్మెల్సీలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పార్టీ 32 మందిని పంపిస్తే.. వారిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే.
కార్పొరేషన్లలోనూ…
98 మంది మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగరపంచాయతీ ఛైర్మన్ల పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిచ్చింది ఏకంగా 70 పదవులు అంటే.. 71.4 శాతం పదవులు మున్సిపల్ ఛైర్మన్లుగా కనిపిస్తున్నారు. మొత్తం 648 ఎంపీపీలు అంటేమండల ప్రజా పరిషత్ పదవులు ఉంటే ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నవి 637 అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిచ్చింది 66.7 శాతం పదవులు.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో జడ్పీ ఛైర్మన్లు 13 కు 13 స్ధానాలు వైయస్సార్సీపీనే గెల్చుకుంది. వీటిలో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలు 9 మంది అంటే 70 శాతం పదవుల్లో వీరే కనిపిస్తారు. గతానికి ఇప్పటికి తేడా మీరే గమనించండి.
చంద్రబాబు గత పాలనలో…
అంతెందుకు ఒకే ఒక్క ఉదాహరణ. గతంలో చంద్రబాబు పాలనలో 2014–19 వరకు గమనించండి. మీ (కృష్ణా) జిల్లానే తీసుకొండి. అప్పుడు జడ్పీ ఛైర్మన్ ఎవరు ? అప్పుడు విజయవాడ మేయర్‌గా పనిచేసింది ఎవరు ? అంతెందుకు మన కనకదుర్గమ్మ టెంపుల్ ఛైర్మన్‌గా పనిచేసింది ఎవరు ? ఆలోచించండి ?
విజయవాడకు కార్పొరేషన్‌కు మేయర్‌గా పనిచేసింది ఎవరూ అంటే కోనేరు శ్రీధర్. అప్పట్లో కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసింది గద్దె అనురాధ. అప్పట్లో కనకదుర్గమ్మ గుడికి ఛైర్మన్‌గా పనిచేసింది యలమంచి గౌరంగబాబు. .. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.
ఇవాళ మన పాలనలో చూస్తే…
కానీ ఈ రోజు విజయవాడ మేయర్‌గా ఉన్నది ఎవరూ అంటే నా చెల్లి భాగ్యలక్ష్మి బీసీ. కృష్టా జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఎవరున్నారంటే… నా మరో చెల్లి హారిక బీసీ. కనకదుర్గమ్మ గుడికి ఛైర్మన్‌గా ఎవరున్నారంటే నా బీసీ అన్న సోమినాయుడు. ఎక్కడ చూసినా నా బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలే కనిపిస్తున్నారు. సామాజిక న్యాయం అంటే ఇది అనీ చేతలతో చేసిన ప్రభుత్వం మనది అని గమనించంది.
నామినేటెడ్ పదవులు, పనుల్లో ఏకంగా 50 శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకే ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. అందులో కూడా 50 శాతం పదవులు నా అక్కచెల్లెమ్మలకే రిజర్వేషన్లు కల్పిస్తూ… చట్టం చేసాం. వివిధ కార్పొరేషన్లుకు ఛైర్మన్ పదవులు ప్రకటించాం. 137 ఛైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదువులు.. ఇందులో 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం.
బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3, ఎస్టీలకు ప్రత్యేకంగా 1 కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు తీసుకుంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కనిపిస్తారు. అక్కచెల్లెమ్మలు 50 శాతం పైగా కనిపిస్తారు. ఆలయ బోర్డుల్లో కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కనిపిస్తారు. తేడా గమనించమని అడుగుతున్నాను.
నూటికి నూరు శాతం మేలు చేయాలన్న తపనతోనే..
ఈ వర్గాలకు అందరికీ కూడా 100 శాతం మేలు చేయాలన్న తపన, తాపత్రయంతో మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. పేదరికం నుంచి వీళ్లందరూ బయట పడాలి.పేదరికం వీళ్ల ఛాయలకుకూడా రాకూడదు. వీళ్ల పిల్లలు బాగా చదవాలి, పెద్ద, పెద్ద ఉద్యోగాలు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. కలెక్టర్ వంటి పెద్ద ఉద్యోగాలు చేయాలి. ఆ అట్టడుగున ఉన్న వర్గాల పేదలందరూ బయటకు రావాలని 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. అంతే కాకుండా వీళ్లు చదవించడానికి ఇబ్బంది పడకూడదని… ఆలోచన చేసి వీళ్లకోసం వసతి దీవెన పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నాం. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి. వారు భావి ప్రపంచంతో పోటీ పడాలి. వాళ్లందరూ ఇంగ్లిషు మీడియంలో చదవాలని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం తీసుకురావడంతో పాటు నాడు నేడు పథకం ద్వారా ఆ ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం.
నా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు కోసం..
నా అక్కచెల్లెమ్మలు బాగుపడాలి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని… ఇళ్లు లేని నిరుపేదలుగా అక్కచెల్లెమ్మలు ఉండకూడదని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. అవన్నీ నా అక్కచెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలలో ఇవాళ దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో శరవేగంగా సాగుతుంది. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే నా అక్కచెల్లెమ్మల ఒక్కో ఇంటి విలువ కనీసం రూ. 7 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందనుకుంటే…. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు విలువ చూస్తే.. నా అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్లు పెట్టినట్లవుతుంది.ఇంతగా వారి గురించి ఆలోచన చేస్తున్నాం. నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఉద్ధేశ్యంతో .. ప్రతి పథకం వారిని దృష్టిలో పెట్టుకునే అడుగులు ముందుకు వేశాం. జగనన్న అమ్మఒడి, జగనన్న ఆసరా, జగనన్న సున్నావడ్డీ, జగనన్న చేయూత తీసుకొచ్చి ఇలా… ఏ పథకంలోనూ అక్కచెల్లెమ్మలను మర్చిపోకుండా అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం.
ఈ మధ్య కాలంలో ప్రభుత్వంలో 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ పిల్లలంతా మన కళ్లముందే ఆనందంగా తిరుగుతున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చెల్లెమ్మలు, తమ్ముళ్లు 86 శాతం ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా, మహిళా న్యాయాలకు అడుగులు ముందుకు పడుతున్నాయి.
మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేక…
ఇవాళ ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయని జీర్ణించుకోలేని కుట్రదారులు కూడా చాలా మంది ఉన్నారు. మంచి జరుగుతున్నప్పుడు సంతోషపడే హృదయాలు కావివి. మంచి జరుగుతున్నప్పుడు రాళ్లు వేసే హృదయాలు అవి. అటువంటి కుళ్లు, కుతంత్రాలు మన కళ్లెదుటే చూస్తున్నాం.
కోట్ల మందికి మంచి చేయడానికి దేవుడు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడనుకుంటే.. అప్పుడు ఆ నమ్మకం జనం మీద పెట్టుకుని పరిపాలన చేస్తారు. నేను ఇవాళ చేస్తున్నది అదే. దేవుడి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మంచి చేయడానికి వాడుతున్నాను. అందుకే నేను చేసిన మంచి మీద నాకు నమ్మకం ఉంది. అందుకే నా నమ్మకం మీ మీద ఉంది.
అప్పుడు ముఖ్యమంత్రి పదవి డీపీటీ కోసం…
కానీ నా కుట్రదారులు ఎలా ఉన్నారంటే.. వారికి అప్పట్లో ఇచ్చిన ముఖ్యమంత్రి పదవిని కేవలం తన వాళ్ల కోసం, తన ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ 5 కోసం, తన దత్తపుత్రుడి కోసం.. వారు మాత్రమే కలిసి రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో.. తినుకో అనే స్కీం కోసం పాలన నడపించారు. దాన్ని గమనించండి. వారు చేసిన పరిపాలన డీపీటీ స్కీం. వారంతా కలిసి దోచుకో, పంచుకో.. తినుకో
స్కీం నడిపిస్తే.. ఈ రోజు తేడా గమనించండి.
ఆ రోజు ఉన్నది ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఆ రోజు అప్పులు గమనిస్తే.. ఆ రోజు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు(అప్పుశాతం పెరుగుదల) 19శాతం ఉంటే…ఈ రోజు అది 15 శాతం మాత్రమే. అంటే ఆ రోజు కన్నా ఈరోజు అప్పులు కూడా తక్కువగానే చేస్తున్నాం. మరి అదే ముఖ్యమంత్రి, అదే రాష్ట్రం…. మరి ఈ రోజు అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం తేడా ముఖ్యమంత్రి మార్పు.
అప్పుడు వాళ్లు ఎందుకు చేయలేకపోయారు… ఇప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగతున్నాడో ఆలోచన చేయండి.
1 లక్షా 65 వేల కోట్లు బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాను అంటే… కారణం ఇవాళ వివక్ష లేదు. లంచాలు లేవు. తేడా గమనించండి.
నాకు వీళ్లమాదిరిగా ఎన్నెన్నో పత్రికలు లేవు, టీవీ ఛానెల్స్ లేవు. నాకు ఈనాడు సపోర్టు ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు. టీవీ5 అండ ఉండకపోవచ్చు. దత్తపుత్రుడి సహాయం ఉండకపోవచ్చు.
నాకు ఉన్నది దేవుడి దయ మీ దీవెనలే….
నేను ఒక్కటే చెప్తున్నాను. వాళ్లకు లేనిది నాకు ఉన్నది ఒక్కటే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు. నా నమ్మకం మీ మీద. నా ధైర్యం మీరు. దేవుడి ఇంకా మంచి చేసే అవకాశం మీ బిడ్డకు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ… నేతన్న నేస్తం కార్యక్రమానికి బటన్ నొక్కి శ్రీకారం చుడుతున్నాను.
చివరిగా..
నియోజకవర్గ అభివృద్ధి గురించి మంత్రి జోగి రమేష్ అడిగారు. దాదాపుగా రూ.102 కోట్ల విలువైన పనులకు సంబధించి అంచనాలు ఇచ్చారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, నీటి సరఫరా, బ్రిడ్జిలు, బీటీ రోడ్ల ప్రతిపాదనలు ఇచ్చారు. రూ.102 కోట్ల పనులకు సంబంధించి మొత్తం మంజూరు చేస్తున్నాను. ఇంకో శుభవార్త కూడా ఏమిటంటే.. కాసేపటి కిందటనే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త వచ్చింది. జిల్లాలో నా తర్వాత కార్యక్రమం మచిలీపట్నం పోర్టుకు శంకుస్ధాపన చేయడమే.. అందుకోసం మరలా జిల్లాకు వస్తాను అని చెప్పి సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.