విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా కుప్పంలో వైకాపా శ్రేణులు ఘర్షణ వాతావరణం సృష్టించటం దుర్మార్గం. పేదలకు రూ.5లకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల ఏర్పాటు అడ్డుకోవటం తగదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరిత ధోరణి విడనాడాలన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు శాంతియుతంగా ఉండాలేగాని, ప్రతిపక్షాలపై దాడులు, కక్షపూరిత చర్యలు సరైనవి కావు. కుప్పంలో జరిగిన విధ్వంసకాండలో పోలీసుల వైఫల్యం వెలుగు చూస్తోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు శాంతియుతంగా చేపట్టిన నిరసనలకు అనుమతులు ఇవ్వకుండా పలు ఇబ్బందులకు గురిచేస్తూ, నాయకులను కార్యకర్తలను ముందస్తు నోటీసులు, గృహనిర్బంధాలు, అరెస్టులు చేసే పోలీసు యంత్రాంగం కుప్పంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి అనుమతి ఎలా ఇచ్చిందని ప్రశ్నిస్తున్నామన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వారికో నీతి, ఇతరులకు మరో రీతిగా వ్యవహరించటం ప్రజాస్వామిక వ్యవస్థకు పెను విఘాతం. కుప్పంలో వైకాపా శ్రేణులు సృష్టించిన విధ్వంసంపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …