అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు తెలుగు భాషాభివృద్ధికి చేసిన సేవలు ఎనలేనివని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పేర్కొన్నారు. గిడుగు రామూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని సోమవారం అమరావతి సచివాలయం మూడవ భవనంలోని రాష్ట్ర తెలుగు భాషా సంఘం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని రామూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని ప్రతి ఏటా “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నామన్నారు.గ్రాంథిక భాషగా ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహారిక వాడుకభాషలోకి తీసుకువచ్చేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని పునరుద్ఘాటించారు.అందుకే గిడుగు రామూర్తి పంతులుని తెలుగు వ్యవహారిక భాషా పితామహనిగా పిలుస్తారని పేర్కొన్నారు.అంతేగాక ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషునిగా పేరుగాంచడంతో పాటు తెలుగు వ్యవహారిక భాష గ్రంధ రచనకు చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు రామూర్తి పంతులని కొనియాడారు.గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.సవర భాషను నేర్చుకొని సవర భాషలో పుస్తకాలు వ్రాసి సొంతడబ్బుతో పాఠశాలలు పెట్టి,అధ్యాపకుల జీతాలు చెల్లించి,సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారని ఆయన కృషిని మెచ్చి మద్రాసు ప్రభుత్వం 1913 లో గిడుగు రామూర్తి పంతులుకు”రావు బహదూర్” బిరుదు ఇచ్చిందని తెలిపారు.అదే విధంగా మద్రాసు ప్రభుత్వం గిడుగు రామూర్తి ఆంగ్లంలో తయారు చేసిన సవరభాషా వ్యాకరణాన్ని1931లోను,సవర-ఇంగ్లీషు కోశాన్ని1938 లోను అచ్చువేయించిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పేర్కొన్నారు.1934 లో ప్రభుత్వం అతనికి ‘కైజర్-ఇ-హింద్ ‘ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించిందన్నారు.
కావున తెలుగు మాతృ భాషాభివృద్ధికి కృషిలో భాగంగా ప్రతి తెలుగు వ్యక్తి తెలుగు భాషను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ పేర్కొన్నారు.ముఖ్యంగా సచివాలయంలోని అన్ని విభాగాల్లోను రోజుకు కనీసం ఒక దస్త్రాన్నైనా తెలుగులో వ్రాయడం ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.*
అంతకు ముందు సచివాలయ సాంస్కృతిక విభాగానికి చెందిన మహిళలు మాతెలుగు తల్లికి మల్లెపూ దండ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం స్పెషల్ సిఎస్ రజత్ భార్గవతోపాటు పలువురు అధికారులు గిడుగు రామూర్తి పంతులు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి,రాష్ట్ర తెలుగు భాషా సంఘం సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …