విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమీషనరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది తో సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశములో నగరములో ఎన్ని అనధికార నిర్మాణములు గుర్తించినారని తెలియజేయమనియూ మరియు వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి వాటి నిర్మూలన లేదా వాటిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయవలసినదిగానూ, అధికారులు మరియు సిబ్బంది ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారము లేకుండా మరియు ఏ విధమైన ప్రలోభాలకు ప్రభావితము కాకుండా విధులు నిర్వహించవలెననియు చైన్ మెన్/ప్లానింగ్ సెక్రటరీల దగ్గర నుండి డి.సి.పి /ఎ.సి.పి ల వరకు అందరిని ఆదేశించియున్నారు. బిల్డింగ్ ప్లాను అనుమతులలో అలసత్వము వహించినను లేదా నిబంధనలు అతిక్రమించిన యెడల సదరు సిబ్బంది మరియు అధికారులను వారి మాతృ సంస్థకు తిరిగి పంపించుటలో వెనుకాడబోమనియూ పెండింగ్ లో ఉన్నటువంటి 300 లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తు దారులను ఓపెన్ ఫోరమ్ నందు పిలిపించి సత్వరమే పరిష్కరించవలెనని, బిల్డింగ్ షార్ట్ ఫాల్స్ పై నోటిసులు ఇచ్చి రుసుము వసూలు చేయవలెనని, సర్కిల్ వారీ రిజిస్టర్లు నిర్వహించవలెనని తెలియజేసినారు.
అదే విధముగా లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, APDPMS భవన నిర్మాణ అనుమతులు, టి.డి.ఆర్ బాండ్స్ మరియు టౌన్ సర్వే కి సంబంధించిన మరి యే ఇతర పట్టణ ప్రణాళికా శాఖ కి సంబంధించిన ఫిర్యాదుల సత్వర పరిష్కారమునకు గాను విజయవాడ నగర పాలక సంస్థ సర్కిల్ కార్యాలయములలో సంబంధిత డిప్యూటీ సిటీ ప్లానర్/అసిస్టెంట్ సిటీ ప్లానర్ వారి ఆద్వర్యములో ప్రతి శుక్రవారము ఉదయము గం.10.30 నుండి మధ్యాహ్నము గం.1.00 వరకు ఓపెన్ ఫోరమ్ నిర్వహించవలసినదిగానూ సదరు ఫోరమ్ నిర్వహణ సమయములో ఆ సర్కిల్ యొక్క బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు మరియు ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొనవలసినదిగా ఆదేశించడమైనది.