విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ హితం కోరుతూ ప్రతిఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు సూచించారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఆలయ ఛైర్మన్ కొల్లూరు రామకృష్ణలతో కలిసి మంగళవారం ఆయన వినాయక మట్టి ప్రతిమలను, వ్రతకల్ప పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలనే సదుద్దేశంతో మట్టి వినాయక ప్రతిమలను, వ్రతకల్ప పుస్తకాలను దేవస్థాన కమిటీ సభ్యులు ఏటా పంపిణీ చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రకృతిని దేవుని రూపంలో పూజించే గొప్ప పండగ చవితి అని.. కనుక ప్రతిఒక్కరం మట్టి గణపతినే పూజిద్దామని పిలుపునిచ్చారు. సహజ సిద్దమైనటువంటి పత్రులు, పూలదండలతో పూజలు నిర్వహించి.. పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని-సంస్కృతిని సమతుల్యం చేస్తూ సుసంపన్నమైన మానవాళి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలెవరూ సంతోషంగా పండుగ జరుపుకోవడాన్ని జీర్ణించుకోలేక ఆంక్షల పేరుతో తెలుగుదేశం, బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో.. నగరంలో ఇప్పటికే వేలాది మండపాలకు అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కనుక విపక్షాల మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్ పర్సన్ కోలా భవానీ, ఈవో సీతారామయ్య, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, మంగళపల్లి చంటి, కూనపులి ఫణి, కొండా, మురుగ, భక్తులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …