విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో కళ్లకు గంతలతో ఊర్మిళ నగర్ లోని తన కార్యాలయం నుంచి పాతబస్తీలోని గాంధీ హిల్ వరకు మంగళవారం ఉదయం గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ చేసిన ప్రచార పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందన్న సదాశయంతో గాంధీ నాగరాజన్ మౌన దీక్ష వహించి కళ్ళకు గంతలతో పాదయాత్రను చేపట్టడం జరిగింది. గాంధీజీ వేషధారణతో గాంధీ నాగరాజన్ ఊర్మిళా నగర్ నుంచి కాలినడకన బయలుదేరడంతో మార్గమధ్యంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు ఈ యాత్ర విశేషాలను అడిగి తెలుసుకోవడం కనిపించింది. గాంధీ నాగరాజు వెంట మువ్వన్నెల జాతీయ పతాకం, ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు రాసిన ప్లకార్డులను చేతబట్టిన మహిళలు ఆయనతోపాటు కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు ఆర్. శివరంజని, బి. భారతి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని నమ్మిన తమ ట్రస్ట్ అధ్యక్షులు నాగరాజన్ చేపట్టిన ఈ మౌన సత్యాగ్రహ ప్రచార పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని వివరించారు . కాగా గాంధీ హిల్ వరకు పాదయాత్ర చేసిన గాంధీ నాగరాజన్ అక్కడినుండి కాలేశ్వరరావు మార్కెట్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తిరిగి పాదయాత్రగా ఉర్మిలా నగర్ లోని ట్రస్ట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన కళ్ళకు గంతలతో ఉండి మౌన దీక్ష వహించి ప్రత్యేక హోదా కావాలంటూ శాంతియుత సత్యాగ్రహ రూపంలో తన ఆకాంక్షను వెలిబుచ్చడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ దీక్షకు పలువురు మద్దతు ప్రకటించారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …