-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-స్వచ్ఛంధంగా ఓటరుకార్డును అధార్ తో అనుసంధానం చేసుకున్న గవర్నర్ దంపతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పౌరులందరూ స్వచ్చంధంగా ముందుకు వచ్చి అధార్ తో ఓటరుకార్డును అనుసంధానం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఓటు పునాది వంటిదని, అధార్ తో అనుసంధానం చేసుకోవటం వల్ల ఎన్నికల వ్యవస్ధలో మంచి ఫలితాలు ఆశించగలుగుతామని పేర్కొన్నారు. మంగళవారం రాజ్ భవన్ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో గవర్నర్ దంపతుల ఓటరు గుర్తింపు పత్రాలను అధార్ నెంబర్ తో అనుసంధానం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఓటరు కార్డు, అధార్ కార్డుల అనుసంధానం తప్పనిసరి కానప్పటికీ పౌరులు తమవంతు బాధ్యతగా ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలన్నారు.
విస్రృత ప్రచారం ద్వారా ఈ కార్యక్రమం పట్ల అందరికీ అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా గవర్నర్ కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను నిర్వహించటం ద్వారా అధార్ తో అనుసంధానం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నివేదించారు. ఎన్ టి ఆర్ విజయవాడ జిల్లా పాలనాధికారి ఢిల్లీ రావు వివరాలను అందిస్తూ నూతన ఓటరు నమోదు ప్రక్రియలో సైతం అధార్ తో అనుసంధానం విషయంలో తగిన ప్రచారం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త పాలనాధికారి నుపూర్ అజయ్ కుమార్, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్, జిల్లా రెవిన్యూ అధికారి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.