-మొదటి, రెండవ సంవత్సర అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తం 1,28,705 మంది ఉత్తీర్ణత..
-రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు సెప్టెంబర్ 10 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-వివరాలను వెల్లడించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి. శేషగిరిబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఆగస్టులో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి. శేషగిరిబాబు విడుదల చేశారు. తాడేపల్లి ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో మంగళవారం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు సంబందించిన దరఖాస్తులను సెప్టెంబర్ 10వ తేదీ వరకూ స్వీకరిస్తామని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలు అధికారిక వెబ్ సైట్ లో పొందుపరుస్తామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా శేషగిరి బాబు మాట్లాడుతూ… ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో జనరల్ లో 35 శాతం, ఒకేషనల్ లో 42 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జనరల్ లో జనరల్ లో 33 శాతం, ఒకేషనల్ లో 46 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అడ్వాన్సడ్ సప్లిమెంటరీ-2022 పరీక్షలను ఆగస్టు 3వ తేది నుండి 12వ తేది వరకూ నిర్వహించగా, 13వ తేదీ నుండి 26 తేదీ వరకూ స్పాట్ వాల్యూయేషన్ జరిపామన్నారు. ఈ పరీక్షలకు జనరల్ లో 3,28,831 మంది, ఒకేషనల్ లో 37,712 మంది మొత్తం 3,66,543 మంది హాజరయ్యారని తెలిపారు. జనరల్ మొదటి సంవత్సర విద్యార్థులు 1,76,942 మంది హాజరుకాగా 61,410 మంది ఉత్తీర్ణత సాధించగా, రెండవ సంవత్సరానికి 1,51,889 మంది పరీక్షలకు హాజరుకాగా 50,691 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అలాగే ఒకేషనల్ మొదటి సంవత్సర విద్యార్థులు 18,399 మంది హాజరుకాగా 7,680 మంది ఉత్తీర్ణత సాధించగా, రెండవ సంవత్సరంలో 19,313 మంది హాజరుకాగా 8,924 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సర ఇంప్రూవ్ మెంట్ కోసం 1,47,164 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 1,28,573 మంది మెరుగైన ఫలితాలను సాధించారని శేషగిరి బాబు తెలిపారు.
ఇంటర్ మీడియట్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం www.bie.ap.gov.in, http://examresults.ap.nic.in వెబ్ సైట్లనందు పొందవచ్చునని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు అధికారులు ప్రభాకర రెడ్డి, గౌడ్, సుశీల, తదితరులు పాల్గొన్నారు.