-దివంగత మహానేతకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళి
-రాజన్న కీర్తి అజరామరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు మేలు చేసిన నాయకుల్లో వైఎస్సార్ మొదటి స్థానంలో నిలుస్తారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దివంగత మహానేత 13వ వర్ధంతి సందర్భంగా అయోధ్యనగర్, మధురానగర్, గిరిపురం, ముత్యాలంపాడు, గాంధీనగర్, సత్యనారాయణపురం, బీసెంట్ రోడ్డు, పాయకాపురం, అజిత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, వాంబే కాలనీ సహా పలు డివిజన్లలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని.. రాజశేఖర్ రెడ్డి గారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించిన ప్రజానాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి అని కీర్తించారు. కుల, మత, పార్టీ, బేధం లేకుండా పేదలకు సంక్షేమ పాలన అందించారని.. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత ఆ మహానేతకే దక్కుతుందన్నారు. కార్మిక, కర్షక, మహిళ, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు హర్షించేలా సువర్ణ పాలనను అందించారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకి వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమన్నారు. ఒక్క మాటతో రాష్ట్ర సమస్యలకు, ఒక్క సంతకంతో అన్నదాతల ఇబ్బందులకు ముగింపు పలికారన్నారు. కనుకనే సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరి మన్ననలు పొందుతూ సుస్థిర పాలన అందించారన్నారు. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర చరిత్రలో చాలా అరుదని కితాబిచ్చారు.
సంక్షేమానికి చిరునామా.. వైఎస్సార్
దేశంలో సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 2004 కి ముందు, తర్వాత అన్న విధంగా పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతాంగానికి ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆయనే ఆద్యులు అని తెలియజేశారు. ప్రమాదాల బారిన పడిన ప్రజల ప్రాణాలను రక్షించడానికి 108 సర్వీసును ప్రారంభించి లక్షలాది మందికి ప్రాణం పోశారన్నారు. వ్యవసాయం దండగంటూ చంద్రబాబు ఈసడించినా.. దానిని పండగ చేసి అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించిన నాయకులు వైఎస్సార్ అని చెప్పుకొచ్చారు. రైతన్నలపై టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తివేశారన్నారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరాన్ని పట్టాలెక్కించడంతో పాటు.. జలయజ్ఞం కింద 84 ప్రాజెక్టులను చేపట్టి సింహభాగం పూర్తి చేశారన్నారు. కోటి ఎకరాలకు నీరందించి రాష్ట్రాన్ని సుభిక్షం చేశారని తెలిపారు. ఆయన హయాంలో రూపుదిద్దుకున్న పలు సాగునీటి ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయన్నారు.
కృష్ణా జిల్లా వాసుల గుండెల్లో ఆయనది చెరిగిపోని స్థానం
ఉమ్మడి కృష్ణా జిల్లాతో మరీముఖ్యంగా విజయవాడ నగరంతో వైఎస్సార్ కి విడదీయరాని అనుబంధం ఉందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ, పేదలకు JNNURM ఇళ్లు, నూజివీడులో ట్రిపుల్ ఐటీ నిర్మాణం, బందర్ పోర్టు శంకుస్థాపన.. ఇలా ఆయన ఆరేళ్ల పాలనలో 60 ఏళ్ళ ప్రగతిని చూపారన్నారు. మిల్క్ ఫ్యాక్టరీ వద్ద ఫైఓవర్ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో నగర రూపురేఖలను పూర్తిగా మార్చివేశారన్నారు. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవాడ వేదికగా వైఎస్సార్ ప్రారంభించారన్నారు. ఆరోగ్యశ్రీ సెకండ్ ఫేజ్ సేవలను సెంట్రల్ నియోజకవర్గంలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం నుంచే ఆ మహానేత ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అటువంటి గొప్ప నాయకులు ప్రమాదవ శాత్తు మరణించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాసంక్షేమంలో తండ్రిని మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ నాయకులు డాక్టర్ వైఎస్సార్ అని.. ఆ మహానేత స్ఫూర్తితో సామాజిక న్యాయం, ప్రజాభ్యుదయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికై రాజన్న ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారని తెలిపారు. ఆనాడు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాల గూర్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీర్తిస్తే.. నేడు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, పేదలందరికీ ఇళ్ల పథకాల గూర్చి దేశం మొత్తం చెప్పుకొంటోందని తెలియజేశారు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని మల్లాది విష్ణు పునరుద్ఘాటించారు.
వైఎస్సార్ స్పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం
వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మహిళలకు చీరలు, పేదలకు పండ్లను పంచిపెట్టారు. వైఎస్సార్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లడమే.. ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమాలలో ఆయా డివిజన్ల వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు, వివిధ కార్పొరేషన్ల డైరక్టర్లు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.