విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తి పారవశ్యంతో ప్రజలు ఆదిదేవుడిన్ని కొలుస్తున్నారు. మూడవ రోజు వేడుకలలో భాగంగా పలుచోట్ల నిర్వాహకులు వినాయక మండపాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా.. ఏ కార్యం చేపట్టాలన్నా తొలి పూజ వినాయకునితోనే మొదలవుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఏ ఆలయానికి వెళ్లినా మొదట గణనాథుడినే దర్శించుకుంటామన్నారు. జ్ఞానాన్ని, సంకల్ప సిద్ధిని అనుగ్రహించే గణనాథున్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు. ఉదయాన్నే వినాయకుడిని దర్శించినా, స్మరించినా, పూజించినా ఆ రోజున పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పారు. వినాయకుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు వెల్లడించారు. రానున్న రోజుల్లో అన్ని రంగాలలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు. సకల విఘ్నాలు తొలగించే వినాయకుని అనుగ్రహం సదా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపైనా, నియోజకవర్గ ప్రజలపై ఇదే విధంగా కొనసాగాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమాలలో ఆయా డివిజన్ల వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …