మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తనదైన పాలనతో తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత కారణ జన్ముడు ,మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమైనా జనహృదయాల్లో నేటికీ కొలువై ఉన్నారని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ లోని వైఎస్సార్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ, రాజకీయాలలో ఎన్నాళ్ళు పదవిలో ఉన్నామనేది ముఖ్యం కాదని, ఉన్న కొద్ది కాలం ప్రజల హృదయాలకు ఎంత చేరువైయ్యమన్నది దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాన్ని చూస్తే అర్ధమవుతుందన్నారు. ఆయన జీవించిన కాలం , ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల మూడు నెలల కాలం ఎందరికో ఆదర్శం అని అన్నారు. పింఛనుతో ఆకలి తీర్చుకుంటున్న పండుటాకు ప్రతి అన్నం మెతుకులోనూ వైఎస్ రాజశేఖరరెడ్డిని చూసుకుంటుందని, ఫీజు రాయితీ తో ఎదిగిన ప్రతి సరస్వతీ పుత్రుడు రాజన్నరుణం తీర్చుకోలేమంటూ చేతులు జోడిస్తాడని, ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందిన నిరుపేదలైతే ఆ ఆత్మీయ నేతను నిత్యం దేవుడిలా కొలుస్తారని ఎమ్మెల్యే పేర్ని నాని కొనియాడారు. గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా.. ఏ రాజకీయనాయకుడు అయినా ప్రజల కోసం అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడా? అందరూ బాగుండాలి. అన్ని ప్రాంతాలూ బాగుండాలి. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం అని నమ్మిన మహానుభావుడు వైయస్సార్ అని అన్నారు. ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించి భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక ఆదర్శ నేతగా మిగిలారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కీర్తి ఈ భూమి ఉన్నంతవరకు నిలిచి ఉంటుందన్నారు. రాజకీయ నేతలు ప్రజల మధ్య పాదయాత్ర చేసి కష్ట సుఖాలు తెలుసుకొనే ధోరణి అప్పటి వరకు లేదని, వైయస్సార్ తోనే పాదయాత్ర మొదలైందన్నారు ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారని అన్నారు.
ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు గొప్ప స్ఫూర్తి , ఆదర్శమని, ఆయన ప్రభుత్వంలో తానూ ఒక శాసనసభ్యునిగా కొనసాగడం, ఆయన పక్కన కూర్చోవడం పలు సందర్భాలలో వివిధ అంశాలపై మాట్లాడటం ఆయనను స్పృశించి ఆ మహానేతతో నడిచే బాగ్యం లభ్యం కావడంతో తన జన్మ సార్ధకతమైందని భావిస్తానని ఎమ్మెల్యే పేర్ని నాని భావోద్వేగంతో అన్నారు.
అనంతరం యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల ఆశీర్వాద్ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని దానం చేశారు. దాదాపు 65 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు బ్లడ్ బ్యాంకు నోడల్ అధికారి డాక్టర్ త్యాగి, డాక్టర్ శ్యామ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవితా థామస్ నోబుల్, మాజీ మునిసిపల్ చైర్మెన్ వైస్సార్ సీపీ పట్టణ అధ్యక్షులు సలార్ దాదా, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ ముస్తఫా( అచ్చేబా ), వైస్ ఛైర్మెన్ తోట సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ అధ్యక్షులు బూరగడ్డ రమేష్ నాయుడు, పలు డివిజన్ కార్పొరేటర్లు, వివిధ గ్రామాల సర్పంచులు వైసీపీ నాయకులు, అభిమానులు, వైయస్ఆర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …