జనసేన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచింది కాబట్టే వైసీపీ వణుకుతోంది… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతిని అడుగడుగునా ఎండగడుతున్నామన్న అక్కసుతోనే తన మీద అక్రమ కేసులు బనాయించి ఇబ్బందిపెట్టే విధంగా కుట్రలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో నిన్నటి రోజున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పుట్టిన రోజు వేడుకల్ని అడ్డుకోవడానికి పన్నిన పన్నాగంలో భాగంగా జరిగిందే జెండా దిమ్మె ఘటన అన్నారు. వివాదం సృష్టించింది ఎవరు? గొడవకు కారణం ఎవరు? జనసేన జెండా ఆవిష్కరణను అడ్డుకున్నది ఎవరు? అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. వివాదం సృష్టించిన వారి మీద కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమ కేసులకు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తల మీద జరుగుతున్న ఈ దాడులను పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎదుర్కొంటామని తెలిపారు. నిన్నటి ఘటనకు కారకులైన వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టే వరకు పోరాటం చేస్తామన్నారు. శనివారం మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్, చేనేత వికాస విభాగం ఛైర్మన్  చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ నేతలు  షేక్ రియాజ్, గాదె వెంకటేశ్వర రావు, బండ్రెడ్డి రామకృష్ణ, అమ్మిశెట్టి వాసు, అక్కల రామ్మోహన్ తదితరులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ…

ఎవరి మెప్పు కోసం పోలీసుల ప్రయత్నం..
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ నగరవ్యాప్తంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాం. పలు ప్రాంతాల్లో జెండా దిమ్మెలు దగ్గర జనసేన జెండాను ఎగురవేయడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాయల్ హోటల్ సెంటర్లో ఏర్పాటు చేసిన జనసేన జెండా ఎగురవేయకుండా అడ్డుకునేందుకు, నగరంలో పార్టీ కార్యక్రమాలను ఆపేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిలువరించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అక్కడ ఏర్పాటు చేసిన జెండా దిమ్మె జనసేన పార్టీది. వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. అడ్డుకోవద్దని ముందుగానే చెప్పడం జరిగింది. జెండా ఆవిష్కరణకు గంట ముందు స్థానిక వైసీపీ నాయకత్వం, కార్పోరేట్లు వచ్చి రౌడీయిజం, గూండాయిజం చేస్తే పోలీసులు వారి మీద ఎందుకు కేసులు పెట్టలేదు. స్థానిక కార్పోరేటర్ అప్పాజీ, రాజేష్, అర్ష్ తో పాటు చాలా మంది వచ్చారు. వీరందరి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? వివాదానికి కారణం ఎవరు? జెండా దిమ్మను అడ్డుకున్నది ఎవరు? వారి మీద కేసులు పెట్టుకుండా మా జెండా మేము ఎగురవేసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం పోలీసులు అధికార పార్టీకి ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో అర్ధం అవుతుంది. పోలీసులు జనసేన జెండాను నలిపి, చింపే విధంగా చేసిన ప్రయత్నం ఎవరి మెప్పు కోసం చేసింది. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మెప్పు కోసమా? ఇంకా ఎవరి మెప్పు కోసమా అన్నది ప్రజలకు సమాధానం చెప్పాలి. మా జెండా దిమ్మ వద్ద మేము కార్యక్రమం చేసుకుంటే ఇంత ఉద్రిక్త పరిస్థితులకు కారణభూతులైన వారి అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు కేసులు కట్టలేదు?

బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా…
మమ్మల్ని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించి అక్కడి నుంచి రిమాండ్ కి పంపాలని కుట్ర చేశారు. బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రాత్రి 10 గంటల తర్వాత ఫిట్నెస్ టెస్టులు చేయించారు. ఐరిష్ కి తీసుకెళ్లి 2 గంటల పాటు వెయిట్ చేయించారు. అర్ధరాత్రి జడ్జి గారి ముందు హాజరు ర్చారు. చివరికి ఆయన తిప్పి పంపడంతో వదిలేశారు. ఇది విజయవాడ నగరంలో జనసేన పార్టీ బలపడకుండా చేసేందుకు పన్నిన కుట్ర. కేసుల ద్వారా పార్టీ బలపడకుండా చేయాలన్న మీ కుట్ర విజయవాడ నగర ప్రజలకు అర్ధమవుతోంది. ఇలాంటి అరెస్టులకి, అక్రమ కేసులకు, ఒత్తిళ్లకు, రిమాండ్లకు భయపడే నాయకత్వం మాది కాదు. విజయవాడలో ఎక్కడ జనసేన పార్టీ జెండా కనబడినా కార్పోరేషన్ వాళ్లు పీకేస్తారు. ఫ్లెక్సీలు కడితే 24 గంటలు గడవక ముందే తీసేస్తారు. జెండా దిమ్మల్ని చూసి భయపడి కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? పోలీసులతో ఒత్తిడి చేస్తే భయపడతామా? దెబ్బకు దెబ్బ కొడతాం.

గత ప్రభుత్వాలు నిలువరిస్తే మీ తండ్రి గారి విగ్రహాలు వాడవాడలా వెలిసేవా?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతిని అడుగడుగునా ఎండగట్టాం. నాలుగు రోజుల క్రితం అక్రమ నిర్మాణాల మీద నగర కమిషనర్ గారికి బలంగా వినతిపత్రం సమర్పించాం. పశ్చిమ నియోజకవర్గంలో కార్పోరేటర్లకు భయం పట్టుకుంది. తమ జేబుల్లోకి వచ్చే డబ్బులు పోతున్నాయన్న ఉద్దేశంతో కావాలనే ఈ రోజు కుట్ర చేశారు. జనసేన పార్టీ అంటే వైసీపీ నాయకులకు ఎందుకంత భయం? మా నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. గత ప్రభుత్వాలు నిలువరిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కూడళ్లలో మీ తండ్రి రాజశేఖరరెడ్డి విగ్రహాలు వెలిసేవా? ఏ చట్టం ఏ న్యాయం మీకు ఆ రోజున విగ్రహాలు పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎన్ని విగ్రహాలకు మీకు అనుమతులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున జెండా ఎగురవేసుకుంటుంటే ఈ విధమైన విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తారా? మాకు బలం.. బలగం ఉంది.. లేకుంటే అక్రమ కేసుల్లో ఇరికించే వారేగా?

వైసీపీ అవినీతి మీద మరింత బలంగా పోరాటం
స్టేషన్ బెయిల్ ఉన్న కేసుతో అర్ధరాత్రి రిమాండుకు ప్రయత్నించడం పోలీసులు నన్ను ఇరికించేందుకు ఏ విధంగా కుట్ర చేశారో అర్ధం అవుతోంది. మీరు ఇటువంటి కుటిల ప్రయత్నాలు ఆపకుంటే తీవ్రంగా ప్రతిఘటి స్తాం. మీ అవినీతి మీద మరింత బలంగా పోరాటం చేస్తాం. అర్ధరాత్రి వరకు వందలాది మంది జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద నిలబడితే వారి మీద కూడా ఏదో కేసు కట్టే ప్రయత్నం చేశారు. స్లోగన్లు ఇవ్వడం కూడా తప్పు అన్నట్టు కేసు పెట్టారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇలాంటి పనులతో జనసేన నాయకులు, కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదు.

పవన్ కళ్యాణ్  మీద అక్కసుతోనే అక్రమ కేసులు
రెండు రోజుల క్రితం జగ్గయ్యపేట ఘటనలోనూ చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. అక్కడా జెండా దిమ్మ ధ్వంసం చేసిన సమయంలో వైసీపీ గూండాలు ఉన్నారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కానీ చర్యలేం తీసుకున్నారో తెలియదు. రాష్ట్రంలో వైసీపీకి జనసేన పార్టీయే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు. ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం చూసి ఆ అక్కసు వెళ్లగక్కేందుకే రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణుల మీద కేసులు కడుతున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే శ్రీ జక్కంపూడి రాజా మా మహిళా నాయకురాళ్లను దూషించి.. ఎదురు వారి మీదే కేసులు పెట్టించారు. జగ్గయ్యపేటలోనూ అలాగే చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్  నాయకత్వంలో బలంగా ఎదుర్కొంటాం. ఈ రౌడీ ప్రభుత్వాన్ని, గూండా ప్రభుత్వాన్ని, ఫ్యాక్షనిస్టు ప్రభుత్వాన్ని ఓడించి పవన్ కళ్యాణ్  నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం.

నిన్నటి రోజున అండగా నిలచిన విజయవాడ, కృష్ణా జిల్లా నాయకులు, కార్యక్తలకు, లీగల్ సెల్ వారికి, అనుక్షణం ఆరా తీసి అండగా నిలచిన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఒక జన సైనికుడ్ని ముట్టుకుంటే కాపాడుకునేందుకు ఎన్ని గంటలైనా నిరీక్షిస్తామని చాటారు. ఐకమత్యంతో పోరాటం చేస్తామని నిరూపించారు అని అన్నారు.

వైసీపీ తాటాకు చప్పుళ్ళకు భయపడం – బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో కోలాహలంగా జరుగుతున్న  పవన్ కళ్యాణ్  జన్మదిన వేడుకలు చూసి వైసీపీ నాయకులు భయపడిపోయారు. వైఎస్ వర్ధంతి వేడుకలు ఆ స్థాయిలో చేయలేక ముఖ్యమంత్రితో తిట్లు తినాల్సి వస్తుందన్న భయంతోనే గొడవ సృష్టించి మహేష్ ని ఆపే ప్రయత్నం చేశారు.  మహేష్ ని ఆపేస్తే విజయవాడలో కార్యక్రమాలు ఆపేయొచ్చన్న కుట్రలో భాగంగానే గొడవ చేశారు. వైసీపీకి ఎలాంటి సంబంధం లేని జెండా దిమ్మతో వారికి పనేంటి? మహేష్ మీద పెట్టిందే తప్పుడు కేసు. బెయిల్ ఇచ్చి పంపాల్సిన కేసులో స్టేషన్లు మార్చడం.. ఏసీపీ స్థాయి వ్యక్తులు వచ్చి డ్రామాలు చేయడం ఏంటి? రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మారి తీరుతుంది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించిన అధికారుల్ని మేము పక్కన పెడతాం. వారి మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని కోరుతున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గొడవకు కారణమైన అధికార పార్టీ నాయకుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చర్యలు తీసుకోకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తాం. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడితే తగిన మూల్యం చల్లించుకోక తప్పదు. శ్రీ మహేష్ కి మా పార్టీ నాయకులంతా అండా ఉంటాం. అవసరం అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కుట్రలను కలసికట్టుగా ఎదుర్కొంటాం. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.

బీసీ నాయకుడి మీద అక్రమ కేసులు పెడతారా? – షేక్ రియాజ్
ప్రకాశం జిల్లా అధ్యక్షులు  షేక్ రియాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుతోందా?  జగన్ రెడ్డి చెప్పిన రాజ్యాంగం అమలవుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజల పక్షాన నిలవాల్సిన పోలీసు వ్యవస్థలో కొంత మంది వైసీపీ ప్రభుత్వానికి ఫ్యాన్స్ మాదిరి వ్యవహరిస్తున్నారు. అలాంటి వారు ఖాకీలు తీసేసి వైసీసీ జెండాలు కప్పుకోవాలి. నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న మా పార్టీకి చెందిన బీసీ నాయకుడి మీద అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోం. ముఖ్యమంత్రి గాని, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లికి గాని దమ్ముంటే ప్రజా కోర్టుకు రండి తేల్చుకుందాం. మీరు ఎన్ని కేసులు అయినా పెట్టండి.. వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. పోలీసులు నిజాయితీగా పని చేయాలి. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న విషయం తెలుసుకోవాలని అన్నారు.

మా నాయకుడు క్రమశిక్షణ మాత్రమే నేర్పారు-  చిల్లపల్లి శ్రీనివాస్
చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ ప్రజా సమస్యల మీద చేస్తున్న పోరాటాలకు భయపడి పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకులు గేమ్ ఆడుతున్నారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాకు క్రమ శిక్షణ నేర్పారు. మీ నాయకుడి మాదిరి కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పలేదు. కేవలం ప్రజల పక్షాన పోరాడటం మాత్రమే నేర్పారు. జెండా దిమ్మలను చేసే భయపడి పోతే ఎలా.? అని అన్నారు.

అవినీతి పుట్టలు పగులుతాయనే – అక్కల రామ్మోహన్ రావు
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి, వారి మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేన అంటే భయపడుతున్నారు. అందుకు నిదర్శనమే విజయవాడ ఘటన. జగ్గయ్యపేటలోనూ రాత్రికి రాత్రి దిమ్మను కూల్చేశారు. నందిగామలో, ఇబ్రహిపట్నంలో ఫ్లెక్సీలు రాత్రికి రాత్రి పీకేశారు. జనసేన పార్టీతోనే ప్రమాదం పొంచి ఉందన్న విషయం వైసీపీకి అర్ధం అయ్యింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మీ అవినీతి పుట్టలు పగులతుతాయని తెలుసుకున్నారు. అందుకే మా పార్టీ నేతల్ని, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మీరు ఎంత తొక్కితే అంత లేస్తాం అని అన్నారు.

రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. దౌర్జన్యాలు.. అక్రమ అరెస్టులతో వైసీపీ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడిపిస్తోంది. బెజవాడలో గంజాయి మాఫియా రాజ్యమేలుతుంటే పట్టించుకోరు. ప్రజా సమస్యల మీద పోరాడుతున్న మహేష్ మీద మాత్రం కేసులు పెడతారా? ఇలాంటి కేసులకు జనసైనికులు భయపడరని అన్నారు. కృష్ణా జిల్లా అధ్యక్షులు  బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ.. పోతిన మహేష్ మీద పెట్టిన అక్రమ కేసులను ఖండించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి  బేతపూడి విజయ్ శేఖర్, పార్టీ నేతలు రావి సౌజన్య, కప్పెర కోటేశ్వరరావు, కిరణ్, గిరిధర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *