-పారిశ్రామిక రంగానికి 24×7 నాణ్యమైన విద్యుత్తు సరఫరా మరింత పకడ్బందీగా చేయండి
-పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో విద్యుత్తే అత్యంత కీలకం
-నమ్మకమైన, నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలి
-విద్యుత్తు రంగం బలోపేతానికి నవీన ఆవిష్కరణలు, టెక్నాలజీని వినియోగించుకోవాలి
-విద్యుత్తు సంస్థలకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టీకరణ
-ప్రస్తుతం కొనసాగుతున్న 24×7 సరఫరాలో అంతర్జాతీయ ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించాలని ఆదేశం
-సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలతో పారిశ్రామిక హబ్ గా రాష్ట్రం
-టెరి సంస్థకు చెందిన జాతీయ విద్యుత్ రంగ నిపుణులతో విద్యుత్తు అధికారులకు నేటి(5.09.2022) నుంచి ‘కెపాసిటీ బిల్డింగ్’ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో పారిశ్రామిక రంగానికి నాణ్యమైన కరెంటును నిరంతరాయంగా సరఫరా చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్తు సంస్థలకు స్పష్టం చేసింది. పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు నాణ్యమైన విద్యుత్తును 24×7 అందించడం అత్యవసరమని, పారిశ్రామికాభివృద్ధికి విద్యుత్తే అత్యంత కీలకమని తెలిపింది. రాష్ట్రానికి పెట్టుబడులు పెరగాలన్నా, రాష్ట్రాభివృద్ధి మరింత వేగిరం కావాలన్నా నాణ్యమైన విద్యుత్తు కీలక పాత్ర పోషిస్తుందని, ఈ అంశంపైనే విద్యుత్తు సంస్థలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొంది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీని వాడుకొని విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయాలని విద్యుత్తు సంస్థలకు దిశానిర్దేశం చేసింది.
పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం నివేదిక ప్రకారం రాష్ట్రానికి గడిచిన రెండున్నరేళ్లలో కొత్తగా రూ.24,956 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అలాగే జనవరి 2020 నుంచి జూన్ 2022 మధ్య 129 మెగా యూనిట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్తు నవీన ఆవిష్కరణలతో పాటు అంతర్జాతీయ టెక్నాలజీలను వినియోగించుకొని విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయాలని మంత్రి తెలిపారు. తద్వారా అత్యంత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు పారిశ్రామిక రంగానికి భరోసా కల్పించాలని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు రానున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్తు శాఖ అధికారులతో వర్చువల్ గా జరిగిన సమావేశంలో మంత్రి పేర్కొన్నారు.
అత్యంత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తును అందిస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని.. అప్పుడే పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడగలుగుతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో విద్యుత్తును సరఫరా చేయాలంటే సరికొత్త అంతర్జాతీయ టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం 24 గంటల పాటు నిరంతరాయంగా చేస్తున్న విద్యుత్తు సరఫరాలో అంతర్జాతీయ ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని.. రాష్ట్రం పారిశ్రామిక హబ్ గా మారుతుందని చెప్పారు. ‘‘చౌక విద్యుత్తుతో ప్రతి కుటుంబం లబ్ధి పొందాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. దీనివల్ల ఆర్థిక, జీవన ప్రమాణాలు పెరుగుతాయి’’ అని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరుగుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఇదే సమయంలో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇందుకు విశాఖపట్నమే మంచి ఉదాహరణ అన్నారు. విశాఖ సర్కిల్లో ఏటికేడాది విద్యుత్తు వినియోగం పెరుగుతోందని చెప్పారు. గడిచిన ఐదేళ్ల సమాచారాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. 2018లో విశాఖపట్నం సర్కిల్లో 13.38 లక్షల మంది ఇంధన వినియోగదారులు 30.52 లక్షల కిలోవాట్ల విద్యుత్తును వినియోగించినట్లు చెప్పారు. జూలై 2022 నాటికి వినియోగదారుల సంఖ్య 28.27 శాతం పెరిగి 17.17 లక్షలకు చేరిందన్నారు. కానీ, విద్యుత్తు వినియోగం మాత్రం 45.72 శాతం పెరిగి 44.48 లక్షల కిలోవాట్లకు పెరిగిందని వివరించారు. సత్వర ఆర్థికాభివృద్ధికి ఇదే నిదర్శనం అని మంత్రి చెప్పారు
విద్యుత్తు రంగం బలోపేతానికి, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దేశంలోనే తొలిసారిగా ఏపీ విద్యుత్తు సంస్థలు అనుసరిస్తున్న విధానాలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్…. ఏపీ ట్రాన్స్ కో సీఎండీ బి.శ్రీధర్, జేఎండీలు పృథ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్దన్ రెడ్డి, ట్రాన్స్ కో డైరెక్టర్లు భాస్కర్, మురళి, నెడ్ క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి తదితర సీనియర్ అధికారులతో కలిసి మంత్రి పెద్దిరెడ్డికి వివరించారు. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల మద్దతుతో రాష్ట్ర విద్యుత్తు సంస్థలు సరికొత్త టెక్నాలజీలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఏపీ ట్రాన్స్ కోకు అభినందనలు తెలిపిన మంత్రి.. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యుత్తు రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని.. శిక్షణ ఇప్పించాలని సూచించారు. విద్యుత్తు రంగంలో ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా అభినందనీయమని చెప్పారు. వినియోగదారుల సంక్షేమం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఏపీ ట్రాన్స్ కో, ఏపీ డిస్కంలకు చెందిన సీనియర్ అధికారుల కోసం విజయవాడలోని విద్యుత్తు సౌధలో సోమవారం(05-09-2022) ‘సామర్థ్య పెంపు (కెపాసిటీ బిల్డింగ్)’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వెబినార్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవలి విధానపరమైన మార్పులు, నియంత్రణా విధివిధానాలు, విద్యుత్తు కొనుగోళ్లు, మార్కెట్ల ప్రభావం, ఆర్థిక నిర్వహణ, సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించేందుకు ఆటోమేషన్ కార్యకలాపాలు, విద్యుత్తు వినియోగంపై ముందే అంచనా వేసే విధానాలు, స్మార్ట్ గ్రిడ్లు, ఎలక్ట్రిక్ రవాణా సహా పలు అంశాలు.. దేశ విద్యుత్తురంగ ప్రస్తుత పరిస్థితులపై అధికారులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.