-ప్రత్యేక దృష్టి సారించండి.. రాష్ట్రాలకు కేంద్రం (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ(బీఈఈ)) సూచన
-అంగన్ అంతర్జాతీయ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ కు ఆహ్వానం
-నివాస భవనాల్లో ఎకో నివాస్ సంహిత (ఈఎన్ఎస్) పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
-ఈసిబీసి అమలు చేస్తున్నందుకు ఆంధ్ర ప్రదేశ్ కు బీఈఈ ప్రశంస
-ఇది అమలు చేయటం ద్వార ఇంధన వినియోగంతో పాటు, వాతావరణ కాలుష్యం తగ్గుదల , ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల
-వాణిజ్య భవనాల్లో ఇంధన సామర్థ్యం ద్వారా రాష్ట్రం లో దాదాపు 900 మిలియన్ యూనిట్లు ఆదా
-అన్ని రంగాల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి
– ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్
-విద్యుత్ వినియోగంలో భవన రంగందే రెండవ స్థానం — బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే భవన నిర్మాణ రంగంలో ఇంధన సామర్ధ్య(ఎనర్జీ ఎఫిసిఎన్సీ) సాంకేతికతను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ(బీఈఈ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
భవన నిర్మాణ రంగంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్య రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అంగన్(ANGAN(ఆగమెంటింగ్ నేచర్ బై గ్రీన్ ఎఫర్డబుల్ న్యూ హెబీటాట్)-2022) అనే అంతర్జాతీయ సదస్సును బీఈఈ నిర్వహిస్తోంది. బీఈఈ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 14 నుంచి 16 వరకు జరగనున్న సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని బీఈఈ ఆహ్వానించింది . ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీకి)ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో రాష్ట్రం తీసుకున్న చర్యలను గురించి వివరించేందుకు రాష్ట్ర ఇంధన శాఖ అధికారులను బీఈఈ ఆహ్వానించింది .
అంగన్ అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో రాష్ట్రాల ఇంధన పరిరక్షణ విభాగాలతో బీఈఈ ఆన్లైన్ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే, బీఈఈ డైరెక్టర్ సౌరబ్ దిద్ది మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2020 లోనే ఈసిబీసి జీఓను విడుదల చేసి ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నదని వారు ప్రశంసించారు. భవన నిర్మాణ రంగంలో ఇంధన సామర్ధ్య ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేయవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభయ్ బాక్రే పేర్కొన్నారు .
ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆహ్వానించినందుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ బీఈఈ కి ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో వాణిజ్య భవనాల్లో ఇప్పటికే ఈసిబీసి కోడ్ ను అమలు చేస్తుండగా, నివాస భవనాల కోసం ఎకో-నివాస్ సంహిత (ఈఎన్ఎస్) కోడ్ ను అమలులోకి తీసుకురావడం పై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు . అలాగే అన్ని రంగాల్లోనూ ఇంధన సామర్థ్యం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 24x 7 నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయటం అలాగే ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం వంటి వాటి పై ప్రత్యేక దృష్టి పెట్టారని విజయానంద్ పేర్కొన్నారు .రాష్ట్రంలో వాణిజ్య భవనాల్లో విద్యుత్ డిమాండ్ దాదాపు 3000 మిలియన్ యూనిట్లు ఉండగా ఇంధన సామర్థ్యం ద్వారా అందులో 30 శాతం (900 మిలియన్ యూనిట్లు ) విద్యుత్ ను ఆదా చేసే అవకాశంఉందని విజయానంద్ తెలిపారు.
న్యూఢిల్లీలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (APSECM) సీఈవోను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నామినేట్ చేశారు.ఎకో నివాస్ సంహిత (ఈఎన్ఎస్)పై అవగాహన కల్పించేందుకు బీఈఈ ,ఇండో-స్విస్ బీప్ సహకారంతో తిరుపతి, వైజాగ్ , విజయవాడలలో ఈఎన్ఎస్ పై మూడు సెమినార్లు నిర్వహించినట్లు ఏపీఎస్ఈసీఎం అధికారులు తెలిపారు.
డీజీ బీఈఈ మాట్లాడుతూ దేశంలో వేగంగా పెరుగుతున్న నిర్మాణ రంగంలో విద్యుత్ డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతుందన్నారు. విద్యుత్ అధికంగా వినియోగిస్తున్న రంగాల్లో భవన నిర్మాణ రంగం రెండో స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో వినియోగమవుతున్న మొత్తం విద్యుత్ లో 33 శాతం భవనాలలోనే వినియోగమవుతుందని పేర్కొన్నారు.నిర్మాణ రంగంలో వినియోగిస్తున్న సిమెంట్, స్టీల్, విద్యుత్ వినియోగం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం విడుదలవుతుందన్నారు. ప్రధానంగా వాణిజ్య భవన నిర్మాణ రంగం దేశంలో ఏడాదికి 9 శాతం చొప్పున పెరుగుదల ఉందని తెలిపారు. అలాగే పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భవనాల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు .
ఈ దృష్ట్యా ప్రధానంగా వాణిజ్య భవనాల్లో ఇంధన సామర్ధ్య ప్రమాణాలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆలా జరగని పక్షంలో ఇంధన వినియోగం పెరిగి తద్వారా వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇది దేశాభివృద్ధి , ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవన ప్రమాణాల పై కూడా పెనుప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు భవన రంగంలో ఇంధన సామర్ధ్య ప్రమాణాలను పూర్తి స్థాయి లో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.
దేశాన్ని 2070 నాటికి కాలుష్య రహితం చేయాలని కేంద్ర ప్రభుత్వం సిఓపీ (COP) 26 సదస్సులో తీసుకున్న విధాన నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను అమలు చేయటం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. ఇంధన సామర్థ్యం అమలు చేయడం వల్ల సాధారణ భవనాలలోనే కాకుండా వాణిజ్య భవనాలు , పరిశ్రమల లోనూ విద్యుత్ పై చేసే వ్యయం భారీగా తగ్గనుందన్నారు. అలాగే మొత్తంగా విద్యుత్ డిమాండ్ తగ్గడం వల్ల డిస్కాములకు విద్యుత్ పంపిణి నష్టాలు కూడా కొంత మేర తగ్గుతాయన్నారు . అలాగే రవాణా రంగంలోనూ ఇంధన సామర్థ్యం ద్వారా నిర్వహణ వ్యయాన్ని తగ్గించవచ్చన్నారు . వీటి అన్నిటి ద్వారా ప్రధమంగా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చునని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చునని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వాలు ఇంధనం పై చేసే వ్యయం కూడా తగ్గించవచ్చునని పేర్కొన్నారు.
అంగన్-2022 అంతర్జాతీయ సదస్సులో వీటిని చర్చించనున్నారు. ప్రధానంగా పర్యావరణ హిత గృహ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చే 500 మంది నిపుణులు మూడు రోజుల పాటు దేశంలో అమలు చేయవలసిన ఇంధన సామర్ధ్య కార్యక్రమాల పై లోతుగా చర్చిస్తారని వివరించారు .