కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు

– శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అందుబాటులో 1189 మంది క్షురకులు
– వీరిలో 214 మంది మ‌హిళా క్షురకులు

తిరుమల, నేటి పత్రిక ప్రజా వార్త :
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు స‌త్వ‌ర సేవ‌లు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. ఎక్క‌డా ఆల‌స్యం లేకుండా మొత్తం 1189 మంది క్షుర‌కులు మూడు షిఫ్టుల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేలా ఏర్పాట్లు చేప‌ట్టారు. వీరిలో 214 మంది మ‌హిళా క్షురకులు ఉన్నారు. రెండేళ్ల త‌రువాత ఆల‌య మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని టిటిడి అంచ‌నా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతోంది. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతోపాటు 10 మినీ కల్యాణకట్టలు ఉన్నాయి. మొత్తం రెగ్యులర్ క్షురకులు 337 మంది కాగా వీరిలో 336 మంది పురుషులు, ఒక‌ మహిళ ఉన్నారు. మొత్తం పీస్ రేటు క్షుర‌కులు 852 మంది కాగా వీరిలో 639 మంది పురుషులు, 213 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1189 మంది క్షుర‌కులు, ముగ్గురు సూపరింటెండెంట్‌లు, ముగ్గురు అసిస్టెంట్‌లు, 20 మంది రెగ్యులర్ మేస్త్రీలు, 46 మంది సహాయక సిబ్బంది మూడు షిఫ్టుల ద్వారా విధులు నిర్వ‌హిస్తున్నారు.

ప్రధాన క‌ల్యాణ‌క‌ట్ట‌తోపాటు, పిఏసి-1, పిఏసి-2, పిఏసి-3, శ్రీ వేంక‌టేశ్వ‌ర విశ్రాంతి గృహం, శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం వ‌ద్ద‌గ‌ల మినీ క‌ల్యాణ‌క‌ట్ట‌లు 24/7 పని చేస్తున్నాయి. జిఎన్‌సి, నంద‌కం విశ్రాంతి గృహం, హెచ్‌విసి, కౌస్తుభం, స‌ప్త‌గిరి విశ్రాంతి గృహం మినీ కల్యాణకట్టలు ఉదయం 3 నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. వీటిలో సోలార్ వాటర్ హీటర్‌తో వేడినీటి సౌక‌ర్యం ఉంది. యాత్రికులు స్నానం చేయడానికి స్నాన‌పు గ‌దులు అందుబాటులో ఉన్నాయి. క్షుర‌కుల‌కు బ్లేడ్లు, డెటాల్, అప్రాన్‌లు, హ్యాండ్ గ్లౌజ్‌లు, యూనిఫాం, పిపిఇ కిట్లు, మాస్కులు అందిస్తున్నారు. చర్మ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి యాంటీ సెప్టిక్ లోషన్ వినియోగిస్తున్నారు. అన్ని కళ్యాణకట్టల్లో యాత్రికులకు ఉచితంగా కంప్యూటరైజ్డ్ టోకెన్ అంద‌జేస్తారు. త‌గినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా కల్యాణకట్టల్లోని హాళ్లన్నింటినీ నిరంత‌రం ప‌రిశుభ్రంగా ఉంచుతున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *