-64వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
పేదల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సోమవారం 64 వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రామాలయం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. దాదాపు 235 గడపలను సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అన్ని వర్గాల వారికి అందలేదని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావులేకుండా అన్ని పార్టీలకు చెందిన కుటుంబాలకు పారదర్శకంగా సంక్షేమం అందుతోందని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. పాతపాడు నుంచి పోలవరం కాలువ రోడ్డులో నూతన డ్రెయిన్లు, రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గ్రామంలో పలు మలుపుల వద్ద ప్రమాదకరంగా ఉన్న ప్రధాన కాలువలపై సిమెంట్ బిల్లలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన చోట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి.. నిరుపయోగంగా ఉన్న ప్రదేశాలలో తొలగించాలన్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటోడ్రైవర్ కందుల క్రాంతి కుమార్ ఇంటిని సందర్శించిన ఆయన క్షతగాత్రున్ని పరామర్శించారు.
సచివాలయ పరిధిలో రూ. 4.16 కోట్ల సంక్షేమం
కుల, మత, వర్గ, ప్రాంత భేదం లేకుండా అర్హతే ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. 280వ వార్డు సచివాలయ పరిధిలో మూడేళ్లలో రూ. 4.16 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 236 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా ద్వారా 222 మందికి రూ. కోటి 20 లక్షలు., అమ్మఒడి ద్వారా 124 మందికి రూ. 18.60 లక్షలు., వైఎస్సార్ సున్నావడ్డీ ద్వారా 300 మందికి రూ.50 లక్షలు., ఆసరా ద్వారా 270 మందికి రూ. 30లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 16 మందికి రూ. 3.77 లక్షలు., చేయూత ద్వారా 93 మందికి రూ. 17.43 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 37 మందికి రూ. 5.55 లక్షలు., వాహనమిత్ర ద్వారా 8 మందికి రూ. 80 వేలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 27 మంది రూ. 2.70 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అలాగే డివిజన్ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 2.10 కోట్ల సాయాన్ని అందజేసినట్లు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పాలన చేతగాక మేనిఫెస్టోను మాయం చేసిన ఘనత చంద్రబాబుది
తెలుగుదేశం హయాంలో 600 కి పైగా హామీలు గుప్పించి ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేక మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి మాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విమర్శించారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల కాలంలో 99శాతం హామీలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబరు 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలు అమలులోకి తీసుకువస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం హర్షణీయమన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాల ద్వారా బీసీ ఆడబిడ్డలకు రూ. 75 వేలు., ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ. లక్ష., దివ్యాంగులకు రూ. లక్షా 50 వేలు., భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ. 40 వేల ఆర్థిక సాయం అందుతుందని వివరించారు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గత ప్రభుత్వం ప్రకటించిన దాని కంటే ఎక్కువగా లబ్ధి చేకూరుతుందన్నారు. టీడీపీ హయాంలో కళ్యాణలక్ష్మి పథకాన్ని కాగితాలకే పరిమితం చేశారని.. సుమారు 17వేలమందికి పైగా జంటలకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా రూ. 68 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని ఆరోపించారు. మరోవైపు ఈనెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన తెలుగుదేశం పలాయనం చిత్తగించడం సరికాదని విమర్శించారు. ప్రజలకు సుపరిపాలనను అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా రాష్ట్రంలోని ఏ రాజకీయ పక్షానికి లేదని మరోసారి స్పష్టమైందన్నారు. సుధీర్ఘంగా సాగిన డివిజన్ పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమానురాగాలు, ఆదరాభిమానాలకుగానూ ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, వైసీపీ నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఎం.రవీంద్రా రెడ్డి, దేవిరెడ్డి మంగారెడ్డి, పిన్నిబోయిన కృష్ణ, దేవిరెడ్డి సంజీవరెడ్డి, సాధం వెంకటేశ్వరరావు, దేవిరెడ్డి కిరణ్ రెడ్డి, పందిరి వాసు, ఇసరపు రాజారమేష్, జిల్లెల్ల శివ, ఇస్మాయిల్, మేడా రమేష్, కొక్కిలిగడ్డ నాని, భోగాది మురళి, వెంకటేశ్వరమ్మ, కుమారి, నిర్మల, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.