-నేడు ఢిల్లీకి మంత్రులు, అధికారుల బృందం
-మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త :
విజయవాడలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నమూనాను పరిశీలించడానికి మంత్రులు, అధికారుల బృందం నేడు ఢిల్లీకి బయలుదేరనుందని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.
డా.బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ పథకంలో భాగంగా విజయవాడలోని పీడబ్ల్యుడీ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ విగ్రహనిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని నాగార్జున సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగానే ఢిల్లీలోని స్టుడియోలో 125 అడుగుల ఎత్తైన నమూనా విగ్రహాన్ని పరిశీలించడానికి మంత్రులు, అధికారుల బృందం 13వ తేదీ మంగళవారం నాడు ఢిల్లీకి వెళ్లనుందని చెప్పారు. బంక మట్టితో చేసిన అంబేద్కర్ విగ్రహ నమూనాను పరిశీలించి విగ్రహ నిర్మాణానికి ఆమోదం తెలపడం కోసమే ఈ బృందం ఢిల్లీకి వెళ్లడం జరుగుతోందని వివరించారు. ఢిల్లీకి వెళ్తున్న బృందంలో మేరుగు నాగార్జున తో పాటుగా కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలం సురేష్, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయలక్ష్మి, ఏపీ ఐఐసీ విసీ ఎండి సుబ్రమణ్యం, ఏపీ ఐఐసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ ప్రసాద్, కేపీసీ ప్రాజెక్ట్స్ ఎండీ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారని నాగార్జున వెల్లడించారు. ఈ బృందం నమూనా విగ్రహ పరిశీలన అనంతరం అసలు విగ్రహ నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్మాణ పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వివరించారు.