-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
బడి మధ్యలో మానేసిన, బడిలో చేరని పిల్లలు, చదువుకు దూరమైన పిల్లలను గుర్తించి వారిని తప్పకుండా పాఠశాలల్లో చేర్పించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు. విజయవాడలో మంగళవారం సమగ్ర శిక్షా – యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని జిల్లాల ఏఎల్ఎస్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లతో ఒక రోజు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ ప్రతి ఊళ్లో ఐదేళ్లు దాటిన పిల్లలు వివరాలు సేకరించాలని కోరారు. ఇందుకోసం యూనిసెఫ్ రూపొందించిన ఓఎస్సీ (అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్) యాప్, పోర్టల్ విధివిధానాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత ప్రకాశం, వైయస్సార్ కడప, నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఈ యాప్ ను అమలు చేయాలని, వచ్చే ఏడాది నుంచి అన్ని జిల్లాల్లో వినియోగించాలని సూచించారు. ఈ యాప్ లో బడి బయటి పిల్లల వివరాల నమోదు, వారిని బడిలో చేర్పించే తీరును అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన పిల్లల వివరాలను కూడా నమోదు చేయాలని ఆదేశించారు.
‘పిల్లల వినోదం ’కథల పుస్తకావిష్కరణ
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రూపొందించిన ‘పిల్లల వినోదం – మార్పు కోసం పిల్లల కథలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో జీవన నైపుణ్యాలు తెలిపే 100 ఆడియో కథలు తెలుగు – ఇంగ్లీషులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక ‘చాట్ బాట్’ లింక్ ద్వారా వాట్సప్ రూపంలో వినడం ఈ కథల పుస్తకం ప్రత్యేకతని, ఈ పుస్తకాన్ని క్యూ.ఆర్ కోడ్ ద్వారా అన్ని జిల్లాల పాఠశాలలకు అందిస్తామని ఎస్పీడీ తెలిపారు. ఈ సమావేశానికి సమగ్ర శిక్షా ఎస్ఏపీడీ బి.శ్రీనివాసరావు, యూనిసెఫ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్టులు గణేశ్ నిగమ్, శేషగిరి మధుసూధన్, యూనిసెఫ్ కన్సల్టెంట్ టి.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.