పేదల ఆత్మబంధువు సీఎం వైఎస్ జగన్ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

-61వ డివిజన్ 261 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
పేదల జీవన స్థితిగతులు మెరుగుపర్చడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 61 వ డివిజన్ 261 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రశాంతి నగర్లో విస్తృతంగా పర్యటించి.. 360 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అందిస్తోన్న సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా వివరించారు. ఈ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని.. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతిఒక్క హామీని నెరవేర్చినట్లు తెలిపారు. డీబీటీ సహా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజల కొనుగోలు శక్తి బాగా పెరిగిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అనంతరం స్థానికులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల పక్కన ఖాళీ స్థలాలతో స్థానికులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. అలాగే అవసరమైన చోట్ల వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు వెలగని వాటిని తక్షణమే మార్చాలని వీఎంసీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్థానికులతో కలిసి డివిజన్లో మొక్కలను నాటారు.

సచివాలయ పరిధిలో రూ. 3.49 కోట్ల సంక్షేమం
అర్హతే ప్రామాణికంగా పేదలందరికీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. 261వ వార్డు సచివాలయ పరిధిలో మూడేళ్లలో రూ. 3.49 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 205 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 219 మందికి రూ. 32.85 లక్షలు., వైఎస్సార్ సున్నావడ్డీ ద్వారా 174 మందికి రూ.29.11 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 62 మందికి రూ. 20 లక్షలు., చేయూత ద్వారా 62 మందికి రూ. 11.62 లక్షలు., కాపు నేస్తం ద్వారా 37 మందికి రూ. 5.55 లక్షలు., వాహనమిత్ర ద్వారా 29 మందికి రూ. 2.90 లక్షలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 7 మందికి రూ. 70 వేల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అలాగే డివిజన్ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 9.84 కోట్ల సాయాన్ని అందజేసినట్లు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాల విమర్శలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గూర్చి మాట్లాడే నైతిక అర్హత రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా తెలుగుదేశంతో అధికారాన్ని పంచుకుని రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించిన బీజేపీకి లేదని విమర్శించారు. అధికారాన్ని ప్రజల కోసం ఏవిధంగా వినియోగించాలో టీడీపీ, బీజేపీలకు తెలియదని.. ఐదేళ్ల కాలంలో అమ‌రావ‌తిని ఎందుకు నిర్మించలేకపోయారో..? సమాధానం చెప్పాలన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని.. పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడిందెవరో..? వేల ఎకరాల భూములను విదేశీ కంపెనీలకు దోచిపెట్టిందెవరో..? రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. ఒక్కసారి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీలపై ప్రజా వ్యతిరేకత ఏస్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. పదేపదే రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చేలా దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ, బీజేపీలకు.. అసెంబ్లీ వేదికగా మరోసారి గట్టిగా సమాధానమిస్తామని మల్లాది విష్ణు అన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా ప్రజల నుంచి లభించిన ఘన స్వాగతానికి, చూపిన ఆదరాభిమానాలకు ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, వైసీపీ కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి, జానారెడ్డి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు ఉమ్మడి వెంకట్రావు, యరగొర్ల శ్రీరాములు, బెవర నారాయణ, గుండె సుందర్ పాల్, కొండాయిగుంట బలరాం, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *