విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
మత్తు పదార్థాలు మరియు మాధక ద్రవ్యాల నిరోధక మరియు నివారణ అధికారుల అవగాహన సదస్సు బుధవారం హోటల్ ఐలాపురం కన్వెన్షన్ హాల్ లో జరిగినది. కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి ముఖ్య అతిధిగా విచ్చేసారు. మొదటగా మంత్రిగారు సమావేశానికి హాజరు అయిన అందరి చేత మత్తుపదార్థాలకు దూరంగా వుంటామని నివారణలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి తమ సందేశంలో మత్తుపదార్థాల వినియోగం రోజురోజుకు తీవ్రమవుతున్నదని, ఇదే విధముగా కొనసాగితే రాబోయే కాలంలో దేశ యువత నిర్వీర్యం అయ్యే అవకాశాలు వున్నాయని, సమాజంలోని అన్ని వర్గాల వారు పోలీసు శాఖ మరియు సంబంధిత శాఖాధికారులతో కలిసి అవగాహన సదస్సులు విస్త్రుతంగా నిర్వహించి ముఖ్యముగా కౌమార దశలో వున్న పిల్లలలో ఈ మహమ్మారి పట్ల అవగాహన కల్గించి, చెడు వ్యసనాలకు దూరంగా వుంచాలని విజ్ఞప్తి చేసారు.
అదే విధముగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ లో కూడా అవగాహన సదస్సు నిర్వహించి పీర్ గ్రూప్స్ ని ఏర్పాటు చేయాలని ఈ యొక్క మత్తుపదార్థాల దూరంగా వుండుటకు అవసరమైన మానసిక శక్తిని విద్యార్థులకు కలిగించాలని తెలియజేసారు. కేంద్ర ప్రభుత్వము తమ కార్యాచరణలో భాగముగా నివారణ మరియు అవగాహన కార్యక్రమాలు, వైద్యశాలలు మరియు పునవాస కేంద్రాలు, అవి నిర్వహించే వారికి శిక్షణా కార్యక్రమాలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసామని తెలియజేసారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకమైన నిఘా వ్యవస్తను ఏర్పాటు చేసి, నార్కొటిక్స్ కంట్రోల్ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు కఠిన చర్యలు చేపడుతున్నామని తెలియజేసారు. ఎన్.సి.బి. ఎస్.పి. కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. యొక్క సేవలను కూడా ఈ సందర్భముగా కొనియాడారు. ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఉమారాజు ని అభినందిస్తు, విజయవాడ పట్టణంలో మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు అయిన సి.పి.ఎల్.ఐ. మరియు ఓ.డి.ఐ.సి. పాజెక్ట్స్ సమర్దవంతముగా నిర్వహించాలని నిర్వాహణాధికారి జె. ఎస్. ఆనంద్ కి తెలియజేసారు.
ఈ కార్యక్రమములో ముఖ్య అతిధులు గా కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్., ఎస్.పి. నార్కొటిక్స్ మరియు ఎ.వి.డి. నారాయణ రావు రిటైర్డు జిల్లా వికలాంగుల శాఖ అధికారి, డా|| జి.శంకర్ రావు, అన్నామణి , సి.డబ్ల్యూ. సి. అధ్యక్షురాలు సువార్త, చైల్డ్ లైన్ అధికారులు రమేష్, ప్రకాష్ తమ సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమములో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొని విజయవంత చేసారు.