-బొర్రాగుహల ఆదాయంలో 20% బొర్రా గ్రామపంచాయితీకి కేటాయించాలి
-రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు కేటాయించిన 6 శాతం రిజర్వేషన్ విధాన్ని పటిష్టంగా అమలు పర్చాలని రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎస్.టి.కమిషన్ చైర్మన్ అద్యక్షతన బుధవారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ కుంభా రవిబాబు మాట్లాడుతూ ఏ.పి.టి.డి.సి. నియామకాల్లో రిజర్వేషన్ కు మించి గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. అయితే రాష్ట్రంలోని ఐ.టి.డి.ఏ. మరియు ఐ.టి.డి.ఏ.యేతర ప్రాంతాల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు కేటాయించిన 6 శాతం రిజర్వేషన్ సక్రమంగా అమలుకావడం లేదనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరిగే నియామకాల్లో ఈ లోటును పూరిస్తూ అర్హత, అవకాశం మేరకు గిరిజన అభ్యర్థులతోనే ఉద్యోగ నియామకాలు జరపాలని పర్యాటక శాఖ అధికారులకు ఆయన సూచించారు. 2007 లో తీసుకున్న నిర్ణయం మేరకు బొర్రా గుహల ద్వారా వచ్చే నికర అదాయంలో 20 శాతం ఆదాయాన్ని బొర్రా గ్రామ పంచాయితీకే కేటాయించాల్సి ఉందని, అయితే ఆ నిర్ణయం సక్రమంగా అమలు కావడం లేదని ఆయన అన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి ఈ ఏడాది జూలై మాసాంతం వరకూ బొర్రా గుహల ద్వారా వచ్చిన మొత్తం నికర ఆదాయంలో 20 శాతం నిధులను అంటే దాదాపు రూ.204.76 లక్షలను బొర్రా గ్రామ పంచాయితీకి కేటాయించాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటి వరకూ కేవలం రూ.41.84 లక్షలను మాత్రమే ఆ పంచాయితీకి కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. మిగిలిన సొమ్ము రూ.162.92 లక్షలను వెంటనే బొర్రా గ్రామ పంచాయితీకి కేటాయించాలని పర్యాటక శాఖ అధికారులకు ఆయన సూచించారు. బొర్రా గుహల్లో గైడ్లుగా పనిచేసే వారికి చెల్లించే పారితోషికాన్ని కూడా పెంచాలని పర్యాటక శాఖ అధికారులను ఆయన కోరారు. రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ సి.ఎస్. డా.రజత్ బార్గవ, ఏ.పి.టి.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.గోవిందరావు, ఎస్.టి.కమిషన్ సభ్యులు వి.శంకర్ నాయక్, విశ్వేశ్వరరాజు, కె. రామలక్ష్మీ, జె.లిల్లీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.