విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ, ఆర్టీసీ హౌస్ రాంప్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల విద్యుత్ ద్విచక్ర వాహనముల ప్రదర్శనను సంస్థ ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రదర్శనను ప్రారంభించారు. NREDCAP ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మధ్య కాలంలో వివిధ రకాల కంపెనీలు విద్యుత్ వాహనాలు ప్రవేశ పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా, ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు వాయిదాల పద్ధతిలో విద్యుత్ ద్విచక్ర వాహనములు ఇవ్వాలని నిర్ణయించింది. “ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ” (NREDCAP) నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పధకం గురించి పూర్తి వివరాలు తెలియజేసే నిమిత్తం ఈ క్యాంప్ నిర్వహించారు. దానిలో భాగంగా విజయవాడ హెడ్ ఆఫీసు విభాగం ఉద్యోగులు మరియు విజయవాడకు దగ్గరలో ఉన్న డిపోల ఉద్యోగులు, అధికారులు హాజరై విద్యుత్ ద్విచక్ర వాహనములకు సంబంధించి అన్ని వివరములు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొబైల్ రంగంలో పేరు గాంచిన TVS, OLA, ATHER లాంటి తదితర కంపెనీలు వివిధ మోడళ్ళ ద్వి చక్ర వాహనముల గురించి పూర్తి వివరాలు ఉద్యోగులకు తెలియజేశారు.
అనంతరం సంస్థ ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ తమ వంతు బాధ్యతగా భావించి ఆసక్తి ఉన్న వాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ విద్యుత్ బైక్ ల వలన డబ్బులు పొదుపు చేసే వీలుందని ఆయన తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరలతో పోలిస్తే, ఈ విద్యుత్ ద్విచక్ర వాహనాలు దాదాపు 10 రెట్ల ఖర్చు తక్కువతో ప్రయాణానికి అనువుగా ఉంటాయని తెలిపారు. ఎన్నో ఫీచర్స్ తో, కాలుష్యం, ధ్వని లేని విధంగా ఇవి ప్రవేశ పెట్టబడ్డాయని ఆయన తెలిపారు. ఉద్యోగులు నచ్చిన మోడల్ ను, సదుపాయాలను బట్టి ఎన్నిక చేసుకోవచ్చునని తెలిపారు. ఈ ప్రదర్శన ఉద్యోగుల సమాచారం కొరకు మాత్రమేనని, నిర్భంధం కాదని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అన్ని ముఖ్య నగరాలలో ఉద్యోగుల కోరిక మేర ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పి.కృష్ణ మోహన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కోటేశ్వరరావు, ఎఫ్. ఏ. & సి.ఏ.వో. రాఘవ రెడ్డి, కార్గో ఇన్ ఛార్జ్ శ్రీ రవి వర్మ, కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై.దానం, ఆర్టీసీ హౌస్ అధికారులు, ఉద్యోగులు, విజయవాడ DY. సి.టి.ఎం. బషీర్, పి.ఎన్.బి.ఎస్.అధికారులు, విజయవాడ డిపో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …